పల్నాడులోకి బీజేపీకీ నో ఎంట్రీ..!

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులకు వ్యతిరేకంగా పల్నాడులో ఆ పార్టీ నిర్వహించతలపెట్టిన బహిరంగసభకు… పోలీసులు అనుమతి నిరాకరించారు. భారతీయ జనతా పార్టీ నేతలు సభా ఏర్పాట్లను చేేసుకున్న గురజాలలో 144 సెక్షన్ విధించారు. గురజాలకు వెళ్తున్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను.. సత్తెనపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురజాలలో పోలీసు ఆంక్షలు ఉన్నందున వెళ్లడానికి వీరు లేదని స్పష్టం చేశారు. మరో వైపు పల్నాడులో బీజేపీ స్థానిక నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురజాలకు వెళ్లే రోడ్డులో బందోబస్తు ఏర్పాటు చేశారు.

గత వారం.. తెలుగుదేశం పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమంపై పోలీసులు తీవ్ర నిర్బంధాలు అమలు చేయడంతో.. విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ.. పోలీసులు బీజేపీ కార్యక్రమం మీద కూడా అదే స్థాయిలో ఆంక్షలు విధించారు. బీజేపీ నేతల్ని హౌస్ అరెస్టులు చేయకపోయినా… గురజాలకు వెళ్లకుండా అడ్డుకుని.. వారి బహిరంగసభను… నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. నిజానికి.. టీడీపీ చేపట్టిన కార్యక్రమం వల్ల ఉద్రిక్తతలు తలెత్తుతాయని పోలీసులు సమర్థించుకునే ప్రయత్నం చేసినా… ప్రజలు నమ్మే అవకాశం ఉంది. కానీ బీజేపీ… కేవలం ఓ బహిరంగసభ మాత్రమే ఏర్పాటు చేసింది. అన్ని రాజకీయ పార్టీలు.. ఇలాంటి సభలను పెట్టుకుంటాయి. అది సహజం. అయినప్పటికీ.. ఈ సభకు అనుమతించడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు.

వంద రోజుల ప్రభుత్వ పాలనపై… బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో… బహిరంగసభలో… మరింత ఘాటు పెంచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో… పల్నాడులో ఉద్రిక్తతల పేరుతో.. సభను అడ్డుకున్నారని బీజేపీవర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎలాంటి ఉద్రిక్తతలకూ అవకాశం లేకపోయినా.. పోలీసులు ఇంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారో అనేది… బీజేపీ వర్గాలుక సైతం అంతుబట్టడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com