తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యేను పోనివ్వడం లేదని ఆయనను ఇంట్లో కూడా ఉండనివ్వడం లేదని కేతిరెడ్డి పెద్దారెడ్డి గురించి జగన్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. రానిచ్చే ప్రశ్నే లేదు ఏం చేసుకుంటారో చేసుకోవాలని సవాల్ చేశారు. పెద్దారెడ్డికి మద్దతిచ్చి తప్పు చేస్తున్నావని జగన్ కే నేరుగా తేల్చి చెప్పారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి… పెద్దారెడ్డి విషయంలో ఒకటే చెబుతున్నారు.. తన ఇంట్లోకి వచ్చి కూర్చున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పెద్దారెడ్డి నిర్వాకాలను బయట పెట్టారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్యాక్షనిస్టు. ఆయన అన్న కేతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి హత్యకు గురైన తర్వాత .. వైఎస్ అందరికీ రాజీ చేశారు. గొడవలు పడకుండా తాడిపత్రిలో జోక్యం చేసుకోకూడదని ఒప్పందం చేశారు. కానీ జగన్ ఆయనను తాడిపత్రిలో దింపారు. అసలు కేతిరెడ్డి సొంత ఊరు శింగనమల నియోజకవర్గంలో ఉంటుంది. తాడిపత్రికి ఆయనకు సంంబధం లేదు. అయినా తీసుకొచ్చి తాడిపత్రిలో పెట్టారు. ఓ సారి గెలిచే సరికి ఆయన రెచ్చిపోయిన విధానం చూసి అందరూ ఔరా అనుకున్నారు. ఓ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేడని.. ఆయన ఇంటికి వెళ్లి కూర్చున్నారు. కాసేపటికి వెళ్లిపోయారు. అరగంటంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చారు కానీ అప్పటికి వెళ్లిపోయారు.
అలాంటివి చాలా చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేసులు లెక్కలేనన్ని పెట్టారు. ఆయన వ్యాపారాలను నిర్వీర్యం చేశారు. ట్రాన్స్ పోర్టు, ట్రావెల్స్ ను మూసేయించారు. గనుల వ్యాపారం ఆపేశారు. ఇలా ఆయనపై చేయని దాడి లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక.. ఆయన ఎందుకు ఊరుకుంటారు?. పెద్దిరెడ్డిని ఊళ్లోకి రానిచ్చేది లేదని సవాల్ చేస్తున్నారు. రానివ్వడం లేదు. ఇప్పుడు ఆయనకు మద్దతుగా జగన్ మాట్లాడితే.. జగన్ తాత ఫ్యాక్షనిజం దగ్గర నుంచి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు కన్నూ మిన్నూ కానరాకుండా వ్యవహరిస్తే… పవర్ పోయినప్పుడు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. మళ్లీ మేము వస్తాం.. ఏదో చేస్తామని బెదిరిస్తే.. ఆ బెదిరింపులకు ఎవరు లొంగుతారు..?