ఆయన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. అంటే, పార్టీ తరఫున ఏ కార్యక్రమం జరిగినా ఆయనకంటూ ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడం కనీస ధర్మం కదా. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఫర్వాలేదు. కానీ, పార్టీ కార్యకర్తలూ నేతలతో జరుగుతున్న సమావేశాల్లో ఆయనకు అగ్రతాంబూలం ఇవ్వాలి. లేకపోతే అధ్యక్షుడు అనే స్థానానికి అర్థమేముంటుంది..? ప్రస్తుతం గుంటూరులో రాష్ట్ర నేతలకు దేశం శిక్షణ శిబిరం నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రామ్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుకు ప్రాధాన్యత ఏదీ అనేది దేశం వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది.
రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు పార్టీలో పదేపదే అవమానం జరుగుతోందని దేశం నేతలే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నారట! అయితే, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దగ్గరకి తీసుకెళ్లే ధైర్యం మాత్రం ఎవ్వరూ చేయడం లేదని తెలుస్తోంది. నాయకత్వ సాధికార సదస్సు పేరుతో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాంగణమంతా పచ్చ ఫ్లెక్సీలూ బ్యానర్లూ వాల్ పోస్టర్లతో నింపేశారు. వాటిలో దూర్భిణి వేసి వెతికినా కళా వెంకట్రావు పాస్పోర్టు సైజు ఫొటో కూడా ఎక్కడా లేదట! పార్టీ అధ్యక్షుడి ప్రస్థావన కూడా ఎక్కడా రావడం లేదట. దీంతో కొంతమంది దేశం నేతలు కాస్త అసంతృప్తితో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంత భారీ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అవమానించినట్టే అవుతుందని అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఇది ఇవాళ్ల మాత్రమే జరిగిన అమానవం కాదు! గతంలో తిరుపతిలో కూడా పార్టీ తరఫున సమావేశాలు నిర్వహించారు. అక్కడ కూడా కళా వెంకట్రావును పట్టించుకున్న నాథుడే లేడు. ఒక ఫ్లెక్సీలోగానీ, ఒక బ్యానర్లోగానీ ఆయన ప్రస్థావన లేదు! అంతేకాదు, పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన ధారాళంగా మాట్లాడే అవకాశం కూడా దక్కడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడికి ఎలాగూ సమావేశాల్లో ప్రాధాన్యత ఇవ్వరు, కనీసం ఒక ఫొటో పెడితే తప్పేముందని దేశం నేతలే కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గుసగుసలు చంద్రబాబు వరకూ చేరకుండా ఉంటాయా చెప్పండీ..? ఎందుకోమరి.. ఫ్లెక్సీలూ ఫొటోల విషయంలో తెలుగుదేశం అధినాయకత్వం మొదట్నుంచీ కాస్త కటువుగానే ఉంటోంది!