బడ్జెట్ లో ఏపికి హోదా లేదు..ప్యాకేజి కూడా లేదు

ఈరోజు కేంద్ర ఆర్ధికమంత్రి లోక్ సభలో ప్రవేశపెట్టిన 2016-17 బడ్జెట్ లో ఏపికి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన చేయలేదని అప్పుడే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు సణుగుతున్నాయి. అయితే ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం (ఉద్దేశ్యం) లేదని కేంద్రప్రభుత్వం ఇంతకు ముందు చాలాసార్లే చెప్పింది కనుక బడ్జెట్ లో దాని కోసం వెతుక్కోవడం అనవసరం. అయితే ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా రాష్ట్రానికి ఇస్తానన్న ఆర్ధిక ప్యాకేజి ప్రస్తావన కూడా బడ్జెట్ లో లేకపోవడం రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు కూడా చాలా ఆగ్రహం కలిగిస్తోంది. అయితే ఈ బడ్జెట్ లో దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా కేటాయింపులు జరుపకపోవడం వలన, ఏపికి ఆర్ధిక ప్యాకేజి ప్రస్తావన లేదని సర్దిచెప్పుకోకతప్పదు. ఆర్ధిక ప్యాకేజి ప్రస్తావన లేకపోవడానికి కూడా ఒక కారణం ఉంది కనుక కనీసం రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికయినా బడ్జెట్ లో కేటాయింపులు కనబడతాయనుకొంటే అవీ కనపడలేదు. రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ. 25000 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి ఉంది. కానీ బడ్జెట్ లో దానికి కేటాయింపులు కనబడలేదు. కేంద్రప్రభుత్వం దానిని ప్రణాళికేతర వ్యయంగా పరిగణిస్తోందో లేకపోతే ఆ హామీని కూడా ప్రత్యేకహోదా హామీలాగేతీసిగట్టునపెట్టబోతోందో మున్ముందు తెలుస్తుంది.

రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, దాని నిర్మాణ పూర్తి బాధ్యత కేంద్రప్రభుత్వం తీసుకొంది. మోడీ-చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఆ ప్రాజెక్టుని 2019 సార్వత్రిక ఎన్నికలలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడే రెండేళ్ళు పూర్తయిపోయాయి. గత వేల కోట్లు ఖర్చయ్యే పోలవరానికి గత ఏడాది బడ్జెట్ లో ఓ వంద కోట్లు, ఈ ఏడాది మరో వంద కోట్లు కేటాయించి కేంద్రం చేతులు దులుపుకొంది. అరకొర కేటాయింపుల వలన ఆ ప్రాజెక్టు ఎన్నటికీ పూర్తవాదు. పైగా పూర్తి చేయలేని ఆ ప్రాజెక్టు కోసం ప్రతీ ఏటా ఇలాగ వంద కోట్లు వృధా చేస్తున్నట్లవుతుంది. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ది ఉన్నట్లయితే, దానికి సరిపడా నిధులు విడుదల చేసి, తగిన ప్రణాళిక, యంత్రాంగం తక్షణమే ఏర్పాటు చేయవలసి ఉంటుంది.

ఇరవై లక్షల మంది కంటే తక్కువ జనాభా కలిగిన విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు లాభదాయకం కాదని, కనుక దానికి నిధులు మంజూరు చేయదలచుకాలేదని చెప్పిన కేంద్రప్రభుత్వం బడ్జెట్ లో రూ.106 కోట్లు ఎందుకు కేతాయించిందో తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పబోతున్న ఐ.ఐ.టి.కి రూ.40 కోట్లు, ఐ.ఐ.ఎం.కి రూ.30కోట్లు, ట్రిపుల్ ఐటికి రూ.20 కోట్లు, ఐ.ఐ.ఈ.ఆర్.ఎస్.కి రూ.40 కోట్లు, ట్రైబల్ యూనివర్సిటీకి కోటి రూపాయలు బడ్జెట్ లో కేటాయించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]