ప్రొ.నాగేశ్వర్ : మోడీకి ఎన్నికల కోడ్ వర్తించదా..?

దేశంలో ఎన్నికల సంఘం తీరు.. వివాదాస్పదంగా మారింది. కొంత మందిపై.. అనుకూలతను.. చూపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో… సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో.. పలువురిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. పలువురు ప్రచారం చేయడంపై నిషేధం విధించారు. అయినా విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి.

మతం పేరిట ఓట్లు అడుగుతున్న బీజేపీ నేతలు..!

మత పరమైన విషయాలపై.. ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై ఎన్నికల సంఘం.. సుమోటోగా చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టు హెచ్చరికల తర్వాత మాత్రేమ తీసుకుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో… అత్యంత ప్రాధాన్యమైన విషయం.. మతపరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారానో… రెచ్చగొట్టడం ద్వారానో ఓట్లు పొందేలా ప్రచారం చేయడం నిషిద్ధం. నాయకులు రోజూ మాట్లాడుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఓపెన్ గానే.. అలీ వర్సెస్ భజరంగ్ భలీ అన్నారు. గతంలో చోటామోటా నాయకులు ఇలాంటివి చేసేవారు. ఇప్పుడు అగ్రనేతలు చేస్తున్నారు. అయినా ఈసీ పట్టించుకోలేదు. ఎప్పుడు అయితే.. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరిగిందో.. అప్పుడే.. అందరూ.. ఈసీ తీరును తప్పుపట్టడం ప్రారంభించారు. మోడీ చేసిన వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి. మోడీకి కోడ్ వర్తించదా అని చంద్రబాబు కూడా ప్రశ్నిస్తున్నారు. అయినా ఈసీ తీరు మారడం లేదు. బాలాకోట్ దాడుల ఘటనను… ఎన్నికలకు వాడకూడదని.. ఈసీ స్పష్టంగా చెప్పింది. కానీ మోడీ, అమిత్ షా… ప్రతి బహిరంగసభలోనూ అదే చెబుతున్నారు. గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ ను విపరీతంగా వాడేశారు. అక్కడ బీజేపీ ఓడిపోతే… పాకిస్తాన్ లో పండుగ చేసుకుంటారన్నారు. ఆ తర్వాత మూడు రాష్ట్రాల ఎన్నికల్లో తన హత్యకు పాకిస్థాన్ తో కలిసి కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆరోపణలు కూడా చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎక్కడా అలాంటి మాటలు మాట్లాడలేదు. పదే పదే ప్రతిపక్షాలకు పాకిస్థాన్‌తో లింక్ పెడుతూంటారు.

మోడీ, అమిత్ షాల ఎజెండా మతమే..! ఐదేళ్ల పాలనపై మాట్లాడటం లేదు..!

ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం.. తాము చేసిన పనుల గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. నోట్ల రద్దు గురించి చెప్పడం లేదు. జీఎస్టీ గురించి చెప్పడం లేదు. బ్లాక్ మనీ తేవడం గురించి చెప్పడం లేదు. ఉద్యోగాల కల్పన గురించి చెప్పడం లేదు. ఈ ఐదేళ్లలో దేశానికి ఏం చేశారన్నదానిపై.. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కానీ.. అలీ వర్సెస్ భజరంగ్ భళీ అంటూ.. మత పరమైన.. పాకిస్థాన్‌తో లింక్ పెట్టి… ప్రచారాన్ని డామినేట్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఏ అంశాన్ని అయిన లేవనెత్తవచ్చు కానీ.. నిబంధనలు ఉల్లంఘించకూడదు. కానీ బీజేపీ నేతలు అదే చేస్తున్నారు. మఖ్యంగా మోడీ అదే చేస్తున్నారు. మోడీ .. కోడ్ ఉల్లంఘించకపోతే… కచ్చితంగా ఈసీ ఆ మాట చెప్పాలి. బాలాకోట్, పాకిస్థాన్, మత విద్వేష ప్రచారాలు.. చేస్తూండటం.. అది ఉల్లంఘన కాదో చెప్పాలి. మోడీ, అమిత్ షా కి కోడ్ వర్తించదని… ప్రకటన చేస్తే.. ఏ సమస్యా రాదు. అలా కాకుండా.. కింది స్థాయి నేతలపై చర్యలు తీసుకుని… పై స్థాయి నేతల్ని.. స్వేచ్చగా వదలిస్తే.. కోడ్‌ను ఉల్లంఘించడం కాదా..?

తిరుగులేని అధికారాలు ఉన్నా.. ఈసీ కీలుబొమ్మగా మారిపోయిందా..?

మత పరంగా ఓట్లు అడగకూడదనేది.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని కీలక అంశం. మరి బీజేపీ.. తన మేనిఫెస్టోలోనే రామ మందిరం అంశం పెట్టింది. మరి ఈసీ ఎందుకు సైలెంట్ గా ఉంటోంది. రెండు మతాల మధ్య విద్వేషాలు పెంచడం… ఎవరు చేసినా తప్పే. ఈ ప్రయత్నం ప్రతిపక్షం.. ముస్లిం ఓట్ల కోసం చేసినా తప్పే.. అధికారపక్షం మెజార్టీ ఓట్ల కోసం విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పు. అయితే యథేచ్చగా.. కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నా ఈసీ పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు చీవాట్లు పెడితేనే… నిద్రలేచారు. నిజానికి వీవీ ప్యాట్ల విషయంలోనూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈసీ విషయంలో.. బాధ్యతలను గుర్తు చేయడానికి పదేపదే సుప్రీంకోర్టు వద్దకు వెళ్లాల్సి వస్తోంది. అంటే.. ఈసీ ఏం చేయకపోవడంతో.. పదే పదే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఈసీ తీరు వల్లే… స్వతంత్ర వ్యవస్థ అయిన ఈసీ తీరుపై అనుమానాలు వస్తున్నాయి. ఈసీకి రాజ్యాంగం ప్రకారం తిరుగులేని అధికారాలు ఉన్నాయి. కానీ తమను నియమించింది కేంద్రం కాబట్టి.. కేంద్రంలోని పెద్దల పట్ల… కృతజ్ఞతతో ఉంటున్నారు. దాని వల్లే ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.