మాజీ మంత్రి, వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు ఉరి శిక్ష కూడా వేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ ఘటన తీవ్రతను ఎవరూ తేలికగా తీసుకోలేదని ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు తాజా విచారణ తర్వాత నిందితులు అందిరికీ కఠిన శిక్షలు పడతాయని.. ఇప్పటికి పాత్రధారులే బయటకు వచ్చారు.. అసలు సూత్రధారులు కూడా బయటకు వస్తారన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడుతోంది.
దర్యాప్తు కొనసాగితేనే సూత్రధారులు బయటకు !
వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు ఆగిపోయింది. గతంలో సుప్రీంకోర్టు గడువు పెట్టి ఆ తేదీలోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశించడంతో ఆ ప్రకారం పూర్తి చేశారు. అయితే ఆ దర్యాప్తులో ఇంకా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బయట ప్రపంచానికి ఈ హత్య గురించి తెలియక ముందే భారతిరెడ్డికి, ఆమె ద్వారా జగన్ రెడ్డికి తెలిసిందని గుర్తించారు. తెల్లవారుజామునే జగన్ తో ఎన్నికల వ్యూహాలపై చర్చలో ఉన్న మాజీ చీఫ్ సెక్రటరీ కల్లాం అజేయరెడ్డి ఈ విషయాన్ని వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం కోర్టులో కూడా ఉంది. ఇప్పుడు వారికి ఎలా తెలిసింది అన్న ది కూడా బయటకు లాగాల్సి ఉంది. దర్యాప్తులో చాలా వరకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేసిన నాటి ప్రభుత్వం
ప్రజలు అధికారం ఇచ్చింది… నేరస్తుల్ని కాపాడటానికే అన్నట్లుగా గత ప్రభుత్వం వ్యవహరించింది. వివేకా హత్యకేసును పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసింది. వివేకా కుటుంబసభ్యులతో పాటు కొంత మంది టీడీపీ నేతల్ని పెట్టి కేసును క్లోజ్ చేయబోతున్నామని నాటి డీజీపీ చెప్పారని.. ఓ టీడీపీ నేత అప్పట్లోనే బయట పెట్టారు. ఆ తర్వాత కేసు సీబీఐకి వెళ్లడంతో తప్పింది కానీ.. లేకపోతే వివేకా కుమార్తెతో పాటు అల్లుడిని నేరస్తులుగా చేసి.. అరెస్టు చేసి ఉండేవాళ్లు. సీబీఐ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత వారికి సృష్టించని అడ్డంకులు లేవు. ఎంతకు దిగజారిపోయారంటే.. సీబీఐ అధికారి మీద కేసులు పెట్టడం, అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం వంటివి .. రాజ్యాంగ వ్యవస్థల పనితీరును కూడా అనుమానించేలా చేశాయి.
హత్యల విషయంలోనూ నిందితులు బయటపడితే నేరాలు చేసే వారికి బలం
రాజకీయ అవినీతిపై కేసులు ఎలాగూ తేలట్లేదు. ఏళ్ల తరబడి కేసులు న్యాయస్థానాల్లో నలిగిపోతున్నాయి. కానీ ఇలాంటి హత్యల విషయంలో మాత్రం .. నేరస్తుల్ని వదిలి పెట్టకూడదు. సొంత కుటుంబ సభ్యుల్ని అత్యంత కిరాతకంగా చంపేసేవారిని.. ఉపేక్షిస్తే.. అలాంటి వారికి బలం పెరుగుతుంది. చట్టం నుంచి ఎలాగైనా తప్పించుకోవచ్చన్న భావనకు వస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఆ స్థితి రాదని సుప్రీంకోర్టు తాజా విచారణలో స్పష్టమవుతోందని అనుకోవచ్చు.