పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి మూడు వారాలైంది. నల్లకుబేరులు ఎంతమంది వెలుగులోకి వచ్చారో తెలీదుగానీ, సామాన్యులు మాత్రం ఇంకా బ్యాంకుల చుట్టూనే తిరుగుతున్నారు. బ్యాంకుల్లో సరిపడా సొమ్ము రావాలన్నా, దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎమ్‌లు వినియోగంలోకి తేవాలన్నా 9 నెలలు పడుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఏతావాతా ఇప్పుడిప్పుడే ప్రధానికి మోడీకి అర్థమౌతున్నది ఏంటంటే… భారత దేశ ఆర్థిక పరిస్థితి ప్రమాదపు కోరల్లోకి వెళ్తోందని! నోట్ల రద్దును యువతను ఆహ్వానిస్తోందనీ, సామాన్యులు సపోర్ట్ చేస్తున్నారనీ ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ, ప్రజల కష్టాలు ఏమాత్రం తీరలేదు! కనీసం ఇప్పటికైనా సరే ఒక స్పష్టమైన విధానంపై కసరత్తు చేయడం లేదు. లేడికి లేచిందే వేళ అన్నట్టు రోజుకో కొత్త నిర్ణయం, పూటకో కొత్త ప్రతిపాదన చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన దగ్గర నుంచీ తడబుడుతూనే ఉన్నారు! కానీ ప్రజల గురించి మాత్రం మాట్లాడం లేదు.
నవంబర్ 24 నుంచి నగదు మార్పిడి పరిమితిని పెంచుతామని ప్రధాని ప్రకటించారు. ఆర్బీఐ కూడా అదే మాట చెప్పింది. కానీ, సరిగ్గా అదే తేదీ నుంచి నగదు మార్పిడి ఆపేశారు. కేవలం బ్యాంకుల్లో డిపాజిట్లు మాత్రమే స్వీకరిస్తున్నారు. బ్యాంకులూ ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డు కట్టేసి కామ్‌గా ఉంటున్నారు. అంతేగానీ, బ్యాంకులూ ఏటీఎమ్‌ల ముందు రోజుల తరబడి లైన్లలో నిలబడుతున్నవారి గురించి మాట్లాడలేదు.
ప్రతిపక్షాలు ఎంత గొంతు చించుకుంటున్నా ప్రధాని పార్లమెంటు సమావేశాలకు వెళ్లడం లేదు! సోమవారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. దేశాన్ని కుదిపేస్తున్న అంశంపై చట్టసభలో ప్రధానమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ, ఇంతవరకూ ఆయన ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. తన తీసుకున్న నిర్ణయం చారిత్రకం అని చెప్పుకుంటున్నారు. అంతేగానీ, బ్యాంకులూ ఏటీఎమ్‌ల ముందు రోజుల తరబడి లైన్లలో నిలబడుతున్నవారి గురించి మాట్లాడలేదు.
ఇక, మన్ కీ బాత్ కార్యక్రమంలోనైనా కరెన్సీ కష్టాల గురించి మాట్లాడతారు అనుకుంటే అదీ లేదు. పెద్ద నోట్ల రద్దును యువత స్వాగతిస్తోందనీ, అందరికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ తెలుసనీ, దేశం ఒక కీలక దశలోకి అడుగుపెడుతున్న సమయంలో యువత సహకరిస్తుందని మోడీ అన్నారు. అంతేగానీ, బ్యాంకులూ ఏటీఎమ్‌ల ముందు రోజుల తరబడి లైన్లలో నిలబడుతున్నవారి గురించి మాట్లాడలేదు.
ఇప్పుడు హడావుడిగా ఆదాయపన్ను చట్టానికి కొన్ని సవరణ అంటూ ఆర్థికమంత్రి పార్లమెంటులో మనీ బిల్లు ప్రవేశపెట్టారు. బ్లాక్‌మనీ ఉన్నవారు స్వచ్ఛందంగా ప్రకటిస్తే దాదాపు 50 శాతం కోత వేస్తామనీ, మిగిలిన 50 శాతం సొమ్ములో 25 శాతం నాలుగేళ్లు లాకిన్‌లో పెడతామంటూ కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. కొన్నాళ్ల కిందటే కదా… ఇలాంటి స్వచ్ఛంద నల్లధన ప్రకటన స్కీమ్ ప్రవేశపెట్టింది. మళ్లీ ఈ సమయంలో దానికే కొద్ది మార్పులు చేసి కొత్త హడావుడి చేస్తున్నారు. అంతేగానీ, బ్యాంకులూ ఏటీఎమ్‌ల ముందు రోజుల తరబడి లైన్లలో నిలబడుతున్నవారి గురించి మాట్లాడలేదు.
రాష్ట్రాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణం పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రులతో ఒక కమిటీని ప్రతిపాదించారు. ఈ కమిటీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని నాయకత్వం వహించాలని అరుణ్ జైట్లీ స్వయంగా ఫోన్ చేసి మరీ కోరారు? అంతేగానీ, బ్యాంకులూ ఏటీఎమ్‌ల ముందు రోజుల తరబడి లైన్లలో నిలబడుతున్నవారి గురించి మాట్లాడలేదు.
దేశమంతా క్యాష్ లెస్ ట్రాంజాక్షన్లు పెరగాలంటూ హడావుడిగా ఒక ఆన్లైన్ సర్వీసును కూడా ప్రారంభించేశారు. భారీ ఎత్తున పత్రికా ప్రకటనలు ఇచ్చేశారు. ఉన్నపళంగా ప్రజలందరూ మొబైల్ బ్యాంకింగ్ నేర్చేసుకోవాలనీ, క్యాష్తో పనిలేకుండా పనులు చక్కబెట్టుకోవచ్చని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంతేగానీ, బ్యాంకులూ ఏటీఎమ్‌ల ముందు రోజుల తరబడి లైన్లలో నిలబడుతున్నవారి గురించి మాట్లాడలేదు.