ఒరిజినల్ టిడిపి లేదు…ఒరిజినల్ టీఆర్ఎస్ ఉందా?

టిడిపి నుంచి టీఆర్ఎస్‌లోకి జంప్ చేసిన తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన ఒరిజినల్ టిడిపి ఇప్పుడు లేదన్న విషయం ఎర్రబెల్లికి తెలిసొచ్చింది. ఇఫ్పుడు అన్ని పార్టీలదీ కలగూర గంప వ్యవహారమే కాబట్టి ఆయన మాటలు కూడా వాస్తవమే అనుకోవచ్చు. కాంగ్రెస్ నేతృత్వంలోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి తెరవెనుక నుంచి మధ్దతు ఇచ్చిన టిడిపి…….ఇక 2019 ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ విధానాలన్నింటికీ తిలోదకాలిచ్చేసినట్టే లెక్క. అలాగే ఇప్పుడు టిడిపిలో టిడిపి నాయకులు ఎంత మంది ఉన్నారు అంటే చెప్పడం కూడా కష్టమే. అందరూ కూడా జంపింగ్ జపాంగ్స్ బ్యాచ్ మెంబర్సే. ఎన్టీఆర్ విధానాలకు తిలోదకాలిచ్చిన, అన్ని పార్టీల నాయకులతో నిండిపోయిన ఇప్పటి టిడిపిని ఎన్టీఆర్ స్థాపించిన ఒరిజినల్ టిడిపి అని చెప్పడం కష్టమే. అంతవరకూ ఎర్రబెల్లి దయాకరరావు నిజాలే చెప్పారు.

కాకపోతే ఇదే సూత్రం టీఆర్ఎస్ పార్టీకి కూడా వర్తిస్తుందన్న విషయం మాత్రం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నంతకాలం ఎర్రబెల్లి దయాకరరావు చెప్పలేడు. ఎందుకంటే టిడిపి నుంచి జంప్ చేశాకే ఒరిజినల్ టిడిపి లేదన్న విషయం ఆయనకు గుర్తొచ్చింది కాబట్టి. ఆయన చెప్పకపోయినా తెలంగాణా ఉద్యమం కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీ …..ఇప్పుడు అధికారం అనుభవిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఒకటేనా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఉద్యమిస్తాం, దాడులు చే్స్తాం, తిరగబడతాం అని చెప్పి అప్పటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎంత రచ్చ చేయాలో అంతా చేసిన పార్టీ టీఆర్ఎస్. అసెంబ్లీలో కూడా యుద్ధవాతావరణాన్ని సృష్టించిన ఘనత టీఆర్ఎస్‌ది. పొరపాటున పోలీసులు ఏమైనా చర్య తీసుకుంటే ….సీమాంధ్ర రాక్షసత్వం అంటూ ఇంకో నాలుగు తిట్లు ఎక్కువ తిట్టి ఇంకాస్త ఎక్కువగా దాడులకు దిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే పార్టీకి శాంతియుత నిరసనలు అన్నా కూడా అస్సలు గిట్టడం లేదు. రైతులకు సంకెళ్ళు వేస్తారు. శాంతియుత ధర్నా అని కూర్చున్నవాళ్ళపైకి ఫేక్ నిరసనకారులను ఉసిగొల్పుతారు. మొత్తంగా ప్రజలకు ఫ్రశ్నించే అధికారం కూడా లేకుండా చేయడంలో బిజీగా ఉన్నారు. అఫ్కోర్స్ అధికారంలోకి వచ్చిన వెంటనే మీడియాను దారిలోకి తెచ్చుకున్నారనుకోండి. విధానాల పరంగా టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన అతి పెద్ద మార్పు ఇది. ఇక ఇప్పుడు టీఆర్ఎస్‌లో హల్చల్ చేస్తున్న నాయకుల్లో చాలా మంది అప్పట్లో సమైక్యవాదం వినిపించినవాళ్ళే. కెసీఆర్ మాటల్లో చెప్పాలంటే తెలంగాణా ఉద్యమ వ్యతిరేకులే. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒరిజినల్ టీఆర్ఎస్ పార్టీ ఇదేనని ఎవరైనా చెప్పగలరా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]