విమోచ‌న దినోత్సవంలో ఆ సంచ‌ల‌నాలేవీ..?

గ‌డ‌చిన రెండు నెల‌లుగా తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం గురించి భాజ‌పా చాలా ప్ర‌చారం చేస్తూ వ‌చ్చింది. అధికారికంగా నిర్వ‌హిస్తామ‌నీ, కేంద్ర హోంమంత్రి వ‌స్తున్నార‌నీ అన్నారు. చివ‌రికి ఆయ‌న రాలేదు. మ‌రో కేంద్ర‌మంత్రి ప్ర‌హ్లాద్ జోషీ వ‌చ్చారు. ఎవ‌రో ఇచ్చిన స్క్రిప్ట్ ప్ర‌కార‌మే మాట్లాడిన‌ట్టే ఆయ‌న ప‌టాన్ చెరు స‌భ‌లో రొటీన్ విమ‌ర్శ‌లు చేశారు. కుక్క‌ల‌కు ఇస్తున్న విలువ కూడా తెలంగాణ అమ‌ర వీరుల‌కు కేసీఆర్ ఇవ్వరా అంటూ విమ‌ర్శించారు. విమోచ‌న దినాన్ని అధికారికంగా నిర్వ‌హించ‌డం మ‌ర్చిపోయార‌న్నారు. విమోచ‌న దినాన్ని అధికారికంగా జ‌రిపించే ప‌రిస్థితిని కేసీఆర్ కి క‌ల్పిస్తామ‌న్నారు!

అనూహ్యంగా ఆర్టిక‌ల్ 370ని రద్దు చేసిన ప్ర‌ధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల‌కు తెలంగాణ‌ను ఎలా దార్లోకి తెచ్చుకోవాలో బాగా తెలుసు అంటూ ప్ర‌హ్లాద్ జోషీ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వ్యూహాల్లో తామున్నామ‌న్నారు. ప‌శ్చిమ బెంగాల్ తో తెలంగాణ రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను పోల్చారు. మ‌మ‌తా బెన‌ర్జీ ప‌రిస్థితి ఏంటో ఇప్పుడు అక్క‌డ అంద‌రికీ తెలిసిపోయింద‌నీ, ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా ఆమె ఇంటికి వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌న్నారు. అలాగే తెలంగాణ‌లో కూడా తామే అధికారంలోకి వ‌స్తామ‌న్నారు! ఆ త‌రువాత మాట్లాడిన కిష‌న్ రెడి, ల‌క్ష్మ‌ణ్ లు కూడా సీఎం కేసీఆర్ మీద విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితమ‌య్యారు.

విమోచ‌న దినంతో భాజ‌పా రాజ‌కీయ ల‌క్ష్యం నెర‌వేరిందా..? ఈరోజున భారీ ఎత్తున చేరిక‌లుంటాయ‌నీ, తెరాస నుంచి కూడా కొంద‌రు వ‌చ్చేస్తున్నారంటూ లీకులు ఇచ్చుకుంటూ వ‌చ్చారు. కానీ, స‌భ‌కు వచ్చేస‌రికి ఆ ఊపే క‌నిపించ‌లేదు! ఇంకోటి… విమోచ‌న దినం సెంటిమెంట్ ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లే స్థాయిలో ఎవ్వ‌రూ మాట్లాడ‌లేక‌పోయార‌నే చెప్పాలి. అధికారికంగా కేసీఆర్ ఈ దినోత్స‌వాన్ని జ‌ర‌ప‌డం లేద‌న్న విమ‌ర్శ‌, కేసీఆర్ నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌, అమ‌రవీరులు ఆయ‌న‌కి ప‌ట్టరా అంటూ మ‌రో విమ‌ర్శ‌…. ఇలా మొత్తం కేసీఆర్ చుట్టూనే నేత‌ల ప్ర‌సంగాలు న‌డిచాయి. అది దాటి, విమోచ‌న దినం ప్రాధాన్య‌త గురించి, దాని నేప‌థ్యం గురించి ప్ర‌జ‌ల‌కు ఎమోష‌న‌ల్ గా ద‌గ్గ‌ర‌య్యే విధంగా ఈ స‌భ సాగ‌లేద‌నే చెప్పాలి. రోజూ ప్రెస్ మీట్ల‌లో కేసీఆర్ ని ఎలా విమ‌ర్శిస్తున్నారో, స‌భావేదిక‌పై కూడా అవే విమ‌ర్శ‌లు చేశార‌న్న‌ట్టుగానే ఉంది. ఆ ప‌రిధి దాటి, రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ స‌భ‌ను ప్రొజెక్ట్ చేయ‌డంలో భాజ‌పా కాస్త వెన‌కబ‌డ్డ‌ట్టుగానే ఉంద‌నాలి. నిజానికి, అమిత్ షా రాక‌పోవ‌డంతోనే ఈ స‌భ మీద కొంత ఆస‌క్తి త‌గ్గింది. ప్ర‌హ్లాద్ జోషీ విమ‌ర్శ‌లు కూడా… అప‌రిచిత వ్య‌క్తి మాట‌ల్లానే వినిపించాయి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com