రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ ఈ రోజు (జనవరి 26) ప్రకటించారు. అదేంటో తెలుసా? ‘డిస్కో రాజా’. ఈ టైటిల్ కొత్తదేం కాదు. ఎప్పటినుంచో వినిపిస్తున్నదే. ప్రేక్షకులకు ‘డిస్కో రాజా’ టైటిల్ సర్ప్రైజ్ ఇవ్వలేదు. కొద్దో గొప్పో సర్ప్రైజ్ ఏదైనా వుందంటే.. అది లోగో డిజైన్ మాత్రమే. సీతాకోక చిలుకలో టైటిల్ డిజైన్, టైటిల్ కింద రివైండ్, ఫాస్ట్ ఫార్వర్డ్, కిల్ డిజైన్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా షూటింగ్ షురూ కానుంది.
తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా టైటిల్ కూడా అంతే. ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ ఏం ఇవ్వలేదు. ఈ సినిమాకు ‘సీత’ టైటిల్ పరిశీలనలో వున్న సంగతి వినిపిస్తుంది. ఇందులో కాజల్ అగర్వాల్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్ర చేసుకుందని వినికిడి. నిన్న టైటిల్ ప్రకటించారు. ఆల్రెడీ తెలిసిన టైటిల్ కనుక ప్రేక్షకులు కొత్తగా అనిపించలేదు. ఈ రిపబ్లిక్ డేకి ప్రేక్షకులకు సంతోషాన్ని, సర్ప్రైజ్ ని ఇచ్చిన సినిమా ప్రకటనలు ఏమీ లేవు. అయితే పద్మ పురస్కారాలు ఆ లోటును తీర్చాయి.
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి పద్మశ్రీ పురస్కారం రావడంతో తెలుగు సాహితీ అభిమానులు, కవులు, గేయ రచయితలు, ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.