ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల శ్రీవెంకటేశ్వరుడ్ని దర్శించుకునేందుకు వీఐపీలంతా క్యూకట్టారు. లెక్క లేనంత మంది వెళ్లారు. ఒక్క తిరుమల ఆలయంలోనే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లోనూ ఈ వీఐపీలు తమ ప్రభావం చూపారు. ఎవరి స్థాయికి వారు దేవుడి దగ్గర వీఐపీ తనం చూపించి సామాన్యులంతా లైన్లలో వస్తూంటే.. తాము మాత్రం… అందర్ని దాటుకుని వీఐపీగా వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వచ్చారు. తాము వీఐపీలమని వారనుకుంటారేమో కానీ.. దేవుడికి కాదు. ఇంకా ఇంత మందిని అన్యాయంగా దాటేసి వచ్చినందుకు దేవుడు ఆగ్రహించవచ్చు కూడా.
దేవుడి ముందు అందరూ దాసులే!
“ దేవాలయం అనేది అహంకారాన్ని వదిలేయాల్సిన చోటు. సామాన్య భక్తులతో కలిసి క్యూలో నిలబడి, గంటల తరబడి వేచి ఉండి దర్శించుకున్నప్పుడే భక్తుడిలో ఓర్పు, భక్తి ,వినయం పెరుగుతాయ. లోకంలో ఏ పదవిలో ఉన్నా, ఎంత ధనవంతులమైనా.. భగవంతుని సన్నిధిలో కేవలం ఒక యాచకుడివి లేదా దాసుడివి మాత్రమే” అని బ్రహ్మశ్రీ చాగంటి వారు చెబుతారు. ఇందులో నూరు శాతం వాస్తవం ఉంది. దేవుడి దగ్గరకు వెళ్లాలన్న చట్టం లేదు. అందరూ నమ్మకంతోనే వస్తారు. ఎందుకు వస్తారు?. మరి ఆ విషయం ఎందుకు వీఐపీలు తెలుసుకోలేకపోతున్నారు.
సామాన్యుడిగా దేవుడ్ని దర్శించుకుంటేనే ఆ తృప్తి
వీఐపీ సంస్కృతి వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదని, భగవంతుడిని శ్రమకోర్చి దర్శించుకున్నప్పుడే ఆ అనుభూతి పరిపూర్ణంగా ఉంటుందని దేవుడ్ని నమ్మే అందరూ చెబుతారు. నిజానికి ఇలా వచ్చి అలా వీఐపీగా దేవుడి ముందుకెళ్లి నాకది చేయి..ఇది చేయి అని కోరుకునేవారికి భక్తి అవుతుందా?. అయితే కొంత మంది వీఐపీలు.. క్యూలైన్లలో రావడం వల్ల సమస్యలు వస్తాయి. అలాంటి వారికి మాత్రం ప్రత్యేకంగా దర్శనం చేయించడంలో తప్పు లేదు.కానీ తామేమిటి క్యూ లైన్లలో రావడం ఏమిటి అన్న వారికి మాత్రం దేవుడిపై గౌరవం లేనట్లే.
అరుదుగానే వెళ్లాలి !
తిరుమల దేవుడ్ని వారానికో.. నెలకో ఓ సారి దర్శించుకోవడం భక్తి కాదు. కోట్లాది మంది క్షణకాలం దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తూంటారు. అలాంటివారికి అవకాశం కల్పించారు. ఏడాదిలో ఒక్క సారి తిరుమల దేవుడ్ని దర్శించుకుని జీవితంలో మనకు కలిగిన శుభాలకు కృతజ్ఞతలు చెప్పుకుని తృణమో..పణమో సమర్పించుకుంటే మానవసేవ..,మాధవసేవ కలసి వచ్చినట్లవుతుంది. అంతే కాదని అదే పనిగా దేవుడి దగ్గర వీఐపీ తనం చూపించామని అనుకుంటే అంత కంటే పిచ్చితనం ఉండదు. కానీ ఈ వీఐపీలు గుర్తించలేకపోతున్నారు.
