మీడియాలో నయీం గురించిన కథలు తగ్గినా వస్తూనే వున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే అవన్నీ నేరాలకు బాధితులకు సంబంధించినవి మాత్రమే.పోలీసులు అధికారులు రాజకీయ నేతలతో అతనికి ఎలాటి సంబంధాలు వుండేవి ఎవరి అండదండలతో ఇన్ని చేయగలిగాడనేది ఎవరికైనా కలిగే సందేహం. మీడియాలో వచ్చే కథలకూ వాస్తవంగా జరిగే పరిణామాలకు మధ్య చాలా తేడా వుంటుంది. దీనికి మీడియా స్వభావం ఒక కారణమైతే మన వ్యవస్థ లక్షణాలు మరో కారణం. నిజానికి మీడియా కూడా దాంట్లో భాగమే. దానికి ఏవో ఆకర్షణీయమైన కథలు కావాలి. తన ప్రయోజనాలూ నెరవేరాలి. తొలి కథనాల తర్వాత మాజీ డిజిపి దినేష్ రెడ్డి నయీంతో సంబంధం లేదని వివరణ ఇచ్చారు. డిటినాయక్ వంటి పోలీసు అధికారులు సంబంధాలు లేవని ప్రకటించారు. వృత్తిపరంగా కలిశానే గాని వ్యక్తిగతంగా సంబంధాలు లేవని తివారి పేర్కొన్నారు. ఉమా మాధవరెడ్డి, కర్నె ప్రభాకర్ వంటి రాజకీయ నేతలు తమపై కథలను ఖండించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ వంటి నాయకులైతే తమనూ అతను బెదిరించాడని బహిరంగంగా వెల్లడించారు. సిట్ కొందరు పోలీసు అధికారులను పిలిపించవనున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. ఆ పిలిచేది మరింత సమాచారం తెలుసుకోవడానికే గాని ఆరోపణలతో కాదని వారూ వివరణ ఇచ్చారు. అసలు పోలీసు అధికారులెవరిపైనా ఎలాటి ఫిర్యాదులు లేవనీ,చర్యలు తీసుకోవడం లేదని కూడా సిట్ చెబుతున్నట్టు సమాచారం. రాజకీయ నాయకుల ప్రసక్తి మొదటే లేకుండా పోయింది.
ఎందుకంటే ఒకరిపై తీసుకుంటే మరొకరిపై తీసుకోవలసి వస్తుంది.మీడియాలో వచ్చే చాలా కథనాలకు తమ ప్రమేయం లేదని, అవన్నీ నిజం కాదని కూడా సిట్ చెబుతున్నది. శాఖా పరమైన దర్యాప్తు చాలదని నేను మొదటే రాశాను.
ఎందుకంటే సిట్‌కు సమచారం రాబట్టడం తప్ప అందుకోసం సమన్లు పంపి రప్పించేందుకు న్యాయపరమైన అధికారాలుండవు. కనుకనే ఇదో కంటితుడుపుగా నయీం నేరాలను వీలైన మేరకు తవ్వితీసి బాధితుల వివరాలు, కూడబెట్టిన ఆస్తులు ముఠాలో భాగస్వాములు తదితర అంశాలను నివేదిస్తుంది. తర్వాత దాన్ని కొనసాగించాల్సింది సిఐడి విభాగం మాత్రమే. ఇప్పటి వరకూ జరుగుతున్నది చూస్తుంటే ఎవరిపైనా ఎలాటి పెద్ద సంచలన చర్యలుండవని అసలు ఏ పెద్ద తలకాయలూ బయిటకు రావని గట్టిగా చెప్పొచ్చు.శాంతిభద్రతలు చూసే ముఖ్యమంత్రులు గతంలోనూ ఇప్పుడూ కూడా దీనిపై ఎందుకు లోతులు తీయాలనుకోలేదో అర్థం కాదు. ఏదో జరిగినట్టు హడావుడి మాత్రం కొనసాగుతుంటుంది. నయీం వెనక పెద్దలకు నో వర్రీ తెలంగాణలో ఇప్పటికి ముగ్గురు పోలీసు అధికారులు ఆత్మహత్యలు చేసుకుంటూ అవినీతి పెత్తనం అందుకు కారణాలుగా ఆఖరి లేఖల్లో పేర్కొన్నారు. అంటే పోలీసు వ్యవస్థ మేడిపండు స్వభావాన్ని పై అధికారుల అవినితిని అధికార పెత్తనాన్ని ఇవన్నీ వెల్లడించాయి. పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ ఇలాగే ఆత్మహత్యలు జరిగితే అసెంబ్లీ అట్టుడికిపోయింది. అయితేనేం?ఆఖరుకు అందరూ సేఫే.