కూటమి ప్రభుత్వం పలు కసరత్తులు చేసి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తోంది. ముందుగా కీలకమైన కార్పొరేషన్ పోస్టులను భర్తీ చేస్తూ వస్తోంది. తాజాగా ప్రకటించిన పోస్టుల్లో గత పదేళ్ల లో పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం కల్పించారు. ఈ జాబితాలోని వారంతా.. ఎన్నో కష్టాలు పడిన వారే. వైసీపీ ప్రభుత్వంపై పోరాడిన వారే.
అమరావతి జేఏసీలో కీలక పాత్ర పోషించి జగన్ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేసిన రాయపాటి శైలజకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. ఆమె చేసిన పోరాటానికి ఎమ్మెల్యే సీటు ఇచ్చినా తక్కువేనని ఎక్కువ మంది అభిప్రాయం. రాయపాటి సాంబశివరావు కుటుంబానికి చెందినా.. ఎన్నికల సమయంలో ఆ కుటుంబంలో కొంత మంది చంద్రబాబుపై, టీడీపీపై విమర్శలు చేసినా.. రాయపాటి శైలజ మాత్రం టీడీపీకి విధేయంగా ఉన్నారు. ఎన్నికల్లో తమ కుటుంబానికి పోటీ చేసే అవకాశం రాకపోయినా ఆమె విధేయత మార్చుకోలేదు.
ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కాలంటే చాలా సమీకరణాలు కలసి రావాలి. రాయపాటి శైలజకు ప్రాధాన్యత పోస్టు ఇవ్వడం క్యాడర్ ను సంతృప్తి పరిచింది. పదవులు అందుకున్న వారంతా పార్టీ కోసం కష్టపడిన వారే. ఎన్నికలకు ముందో..ఆ తర్వాతో పార్టీలోకి వచ్చి పదవులు పొందిన వారు ఎవరూ లేరు. ఎంతో కసరత్తు చేసి మరీ పార్టీపదవుల్ని భర్తీ చేస్తున్నారని ఈ పరిణామాలతో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికి ఇంకా ఎన్నో మార్కెట్ కమిటీ పదవులతో పాటు అత్యంత కీలకమైన ఆలయ పాలక మండళ్ల పదవులను భర్తీ చేయాల్సి ఉంది. టీడీపీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు పదవి దక్కేలా కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో కూటమి నేతలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో వారు కూడా హ్యాపీ అవుతున్నారు. పార్టీ కోసం పెద్దగా కష్టపడకుండా.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు అలవాటు పడిన వారిని నిర్మోహమాటంగా పక్కన పెట్టేందుకు టీడీపీ నాయకత్వం రెడీగా ఉంది.