కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ముఖచిత్రం శరవేగంగా మారుతోంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, భారీ ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అడుగులు వేస్తుండటంతో ఈ ప్రాంతం త్వరలోనే దక్షిణ భారత దేశపు సరికొత్త ఆర్థిక కేంద్రంగా అవతరించబోతోంది.
భిన్న రంగాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు
ఉత్తరాంధ్ర పారిశ్రామిక చరిత్రలో మార్చి 23, 2026 ఒక చారిత్రాత్మక దినంగా నిలవబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఆర్సెలర్ మిట్టల్ – నిప్పన్ స్టీల్ ( మెగా గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కాబోతున్న ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు ఒక లక్ష మందికి ఉపాధి లభించనుంది. దీనికి అనుబంధంగా రూ.11,198 కోట్లతో ఏర్పాటు కానున్న సొంత ఓడరేవు ఈ ప్రాంత ఎగుమతి, దిగుమతులకు వెన్నెముకగా మారనుంది.
గూగుల్ ఏఐ హబ్: విశాఖకు గ్లోబల్ గుర్తింపు
ఐటీ రంగంలో విశాఖపట్నం రేంజ్‌ను మార్చేలా గూగుల్ ఏఐ హబ్ పనులు వేగవంతమయ్యాయి. సుమారు 15 బిలియన్ డాలర్లు అంటే రూ. 1.25 లక్షల కోట్లు పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్, ఏఐ హబ్‌కు ఏప్రిల్ 2026లో శంకుస్థాపన జరగనుంది. గూగుల్ తన పూర్తిస్థాయి ఏఐ స్టాక్‌ను ఇక్కడ మోహరించడమే కాకుండా, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ నెట్‌వర్క్‌ను కూడా విశాఖకు అనుసంధానిస్తోంది. దీనివల్ల విశాఖ నగరం కేవలం సాఫ్ట్వేర్ సెంటర్‌గానే కాకుండా, ప్రపంచ స్థాయి డిజిటల్ గేట్వేగా మారుతుంది. ఇది సుమారు 1.88 లక్షల ఉద్యోగాల సృష్టికి మార్గం సుగమం చేయనుంది.
సాఫ్ట్వేర్ , మౌలిక సదుపాయాల వెల్లువ
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న లిఫ్ట్ పాలసీ ఫలితంగా విశాఖకు ఐటీ దిగ్గజాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ. 1,370 కోట్లతో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తుండగా, కాగ్నిజెంట్ రూ. 1,583 కోట్లతో భారీ ఐటీ పార్కును నిర్మిస్తోంది. వీటికి తోడు అదానీ గ్రూప్ డేటా సెంటర్లు, అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్స్ వంటివి ఉత్తరాంధ్రను మ్యానుఫ్యాక్చరింగ్ , సర్వీస్ సెక్టార్ల సమ్మేళనంగా మారుస్తున్నాయి. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 లక్షల ఐటీ ఉద్యోగాల సాధనలో విశాఖ సింహభాగం వహించబోతోంది.
దశ మారుతున్న తీర ప్రాంతం
ఉత్తరాంధ్ర రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతుండగా, విశాఖపట్నం పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ,మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావడంతో విశాఖకు గ్లోబల్ కనెక్టివిటీ పెరుగుతుంది. వచ్చే నాలుగేళ్లలో ఈ ప్రాంతం కేవలం ఏపీకే కాకుండా, యావత్ దేశానికి ఆర్థిక ఇంజిన్‌గా మారి, స్థానిక యువతకు వలసల కష్టాలు తీర్చి సొంత గడ్డపైనే ఉపాధి కల్పించేలా రూపుదిద్దుకుంటోంది.
