ఓటుకి నోటు కేసు కంచికి చేరినట్లేనా?

ఇక “చంద్రబాబు నాయుడుని ఆ బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు. ఆయన జైలుకి వెళ్ళాక తప్పదు.” ప్రజా ప్రతినిధికి లంచం ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయినప్పటికీ బుకాయించడం రేవంత్ రెడ్డికి చంద్రబాబు, తెదేపా నేతలకే చెల్లు. కానీ మా వద్ద అన్ని సాక్ష్యాధారాలున్నాయి. కనుక ఈ కేసు నుండి వారిలో ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరు.” తెరాస మంత్రులు, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలే ఇవ్వన్నీ.
తెలంగాణా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్లు మావద్ద బలమయిన ఆధారాలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు తెరాస ప్రభుత్వం కూలిపోక తప్పదు. ఒక ఐ.ఎ.యస్. ఇద్దరు ఐ.ఫై.యస్. అధికారులు, అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రలో భాగస్తులు. వారందరికీ త్వరలోనే నోటీసులు జారీ చేస్తాము.” తెదేపా మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలికిన మాటలివి.
“చట్టం పని తను చేసుకు పోతుంది. అందులో మేము జోక్యం చేసుకోము.” కొన్ని రోజుల తరువాత ఇరు రాష్ట్రాల మంత్రులు చెప్పిన మాటిది.
మొదట వారు పలికిన ప్రగల్భాలకి చివరికి వారు చెప్పిన ఈ మాటకి మధ్య ఎంత తేడా ఉందో అర్ధమవుతూనే ఉంది. అంటే ఓటుకి నోటు కేసుని తెలంగాణా ప్రభుత్వం అటకెక్కిస్తే, అందుకు బదులుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అటకెక్కించేందుకు పరస్పర అంగీకారం కుదిరినట్లు అర్ధమవుతోంది. అంతే కాదు ఇప్పుడు ఆంద్రప్రదేశ్ మంత్రులెవరూ కూడా సెక్షన్: 8ని అమలుచేయాలని ఇదివరకులా పట్టుబట్టడం లేదు. అంటే ఓటుకి నోటు కేసుని తెలంగాణా ప్రభుత్వం అటకెక్కిస్తే, సెక్షన్: 8ని ఆంధ్రా ప్రభుత్వం అటకెక్కించినట్లుంది. అంటే సెక్షన్: 8 అనేది తెదేపా తనను తాను రక్షించుకొనేందుకు ముందుకు తీసుకువచ్చిందని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు నిజమని నమ్మకతప్పదు.

ఇవ్వాళ్ళ ఈ ఓటుకి నోటు కేసులో ఐదవ ముద్దాయిగా ఉన్న తెదేపా ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్యని కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు గడపలు ఎక్కే శ్రమ లేకుండానే ఎసిబి కోర్టే బెయిలు మంజూరు చేసింది. కనుక ఇక ఈ కేసు దానితో బాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండూ కూడా అటకెక్కేసినట్లే భావించవచ్చును. మహా అయితే మరికొన్ని రోజులు ఈ కేసుల డ్రామా నడిపించవచ్చునేమో? లేకుంటే చంద్రబాబుని ఆ బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేదని బల్ల గుద్ది వాదించిన తెరాస ప్రభుత్వం నెలన్నర గడిచిపోయినా ఇంతవరకు ఆయనకి ఎసిబి చేత ఎందుకు నోటీసులు ఇప్పించలేకపోయింది?

చంద్రబాబు నాయుడు ఫోన్ సంభాషణలని ప్రసారం చేసినందుకు విశాఖ పోలీసు అధికారులు పనిగట్టుకొని హైదరాబాద్ వెళ్లి మరీ తెలంగాణా న్యూస్ ఛానల్ కి నోటీసులు ఇచ్చి నెలరోజులవుతున్నా మళ్ళీ ఎందుకు దాని ఊసు ఎత్తడం లేదు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బలమయిన ఆధారాలున్నాయని వాదిస్తున్న తెదేపా ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయింది? అనే ప్రశ్నలన్నిటికీ సమాధానంగానే రెండు పార్టీలు వాటి అధినేతలు కలిసి ఈ ముగింపునిచ్చినట్లున్నారు.

వారిరువురూ ఆడిన ఈ రాజకీయ చదరంగం ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? అనే విషయాన్ని పక్కన బెడితే రెండు రాష్ట్రాలలో ప్రజలే ఓడిపోయారని చెప్పక తప్పదు. వారిరువురు మొదలుపెట్టిన ఈ పోరాటంలోకి ప్రజలను కూడా బలవంతంగా లాగి, వారి భావోద్వేగాలతో చెలగాటం ఆడుకొని ఇప్పుడు ఏమీ జరగనట్లు సైలెంట్ అయిపోయారు. అంతేకాదు వారు చేసిన తప్పులకి శిక్షలు కూడా అనుభవించకుండా నేర్పుగా తప్పించుకొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారని ఒకరిని మరొకరు ఇంతవరకు నిందించుకొన్నారు. కానీ ఆ రెండు పార్టీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే కాక, ప్రజల నమ్మకాన్ని కూడా వమ్ము చేసాయని చెప్పక తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]