టాలీవుడ్ క్యాలెండర్ క్లైమాక్స్ కి చేరుకుంది. ప్రీక్లైమాక్స్ గా భావించిన నవంబరులో పెద్ద, చిన్న, మీడియం.. ఇలా అన్ని రకాల సినిమాలు వరుసకట్టాయి. రవితేజ ‘మాస్ జాతర’ అంచనాలు తప్పింది. ప్రీమియర్ షోలతో సందడిగా మొదలైనప్పటికీ పైనల్ బాక్సాఫీస్ రిజల్ట్ మాత్రం దెబ్బకొట్టింది. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ కథనాలు రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్ పడేలా చేశాయి.
రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. లేడి ఓరియంటెడ్ మూవీ ఇది. ఈ జానర్ కి రావాల్సిన కలెక్షన్స్ అయితే వచ్చాయి. సుధీర్‌బాబు ‘జటాధర’తో తీవ్రంగా నిరాశపరిచాడు. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తో చేసిన ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ తేలిపోయింది.
చిన్న సినిమాగా వచ్చిన తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’ మంచి రివ్యూలు తెచ్చుకుంది. సినిమాలో వినోదం ప్రేక్షకులని హత్తుకుంది. కెరీర్ లో తొలిసారి ఓవర్సిస్ మార్కెట్ లో కూడా తిరువీర్ కాస్త ప్రభావం చూపగలిగాడు. నవంబర్ లో వచ్చిన మంచి సినిమా ఇది.
దుల్కర్ సల్మాన్ ‘కాంత’ బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. నటన పరంగా ఇందులో అందరికీ మంచి పేరు వచ్చింది. టెక్నికల్ గా కూడా సినిమా బావుంది. అయితే జనం ఈ సినిమా వైపు చూడలేదు. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ‘సంతాన ప్రాప్తిరస్తు’ క్లిక్ అవ్వలేదు. సందీప్ రెడ్డి సపోర్ట్ గా నిలిచిన ‘జిగ్రీస్’ కూడా ప్రేక్షుకులని థియేటర్స్ కి రప్పించలేకపోయింది. అల్లరి నరేశ్ ‘12ఏ రైల్వే కాలనీ’ డిజాస్టర్. రెండో ఆట నుంచే ఈ సినిమా జాతకం తేలిపోయింది. అటు యూనిట్ కూడా రెండో నుంచే సినిమాని మర్చిపోయింది.
వేణు ఊడుగుల షో రన్నర్ గా చేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది. ప్రమోషన్స్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాయి. బన్నీ వాసు, వంశీ నందిపాటి హ్యాండ్ కలిసొచ్చింది. వసూళ్లు బావున్నాయి. రాజ్‌తరుణ్ ‘పాంచ్ మినార్’కి సరైన ప్రమోషన్స్ లేవు. సినిమాపై జనం దృష్టి పడలేదు. వారం రోజుల్లోనే సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రియదర్శి ‘ప్రేమంటే’ మరో డిజాస్టర్. కథ, కథనాలు ఎంత మాత్రం ఆకట్టుకోలేకపోయాయి.
నవంబర్ లో అందరి దృష్టిని ఆకర్షించిన రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు హిట్ టాక్ వచ్చింది. మంచి రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీసు వద్ద డీసెంట్ వసూళ్లు కనిపించాయి. స్కంద, డబుల్ ఇస్మార్ట్ లాంటి డిజాస్టర్స్ చూసిన రామ్ కి ఆంధ్ర కింగ్ తాలూకా ఫలితం మంచి ఉపసమనం.
కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా’ అట్టర్ ఫ్లాఫ్. ఈ సినిమాకి ఏ మాత్రం ప్రచారం లేదు. రిలీజ్ ముందు రోజు ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా పెద్దగా ఉపయోగపడలేదు. కొన్ని చోట్ల షోలు కూడా క్యానిల్ అయిపోయాయి. మొత్తానికి చాలా అంచనాలతో మొదలైన నవంబర్ ‘ఆంధ్ర కింగ్ లాంటి డీసెంట్ తో పాటు ‘ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న మెరుపులతో సరిపెట్టుకుంది.
