కాంతార… కన్నడ చిత్రసీమ గర్వంగా చెప్పుకొనే పేరు. రిషబ్ శెట్టికి ఈ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇప్పుడు కాంతార 2తో బిజీగా ఉన్నారాయన. ఈ సినిమా త్వరలోనే రాబోతోంది. కాంతార 3కి కూడా పార్ట్ 2లోనే లీడ్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. కాంతార 3 ఇంకా భారీగా రూపొందించాలన్నది రిషబ్ ప్లాన్. అందులో భాగంగా మరో స్టార్ హీరోని ఈప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి.
ఆ స్టార్ హీరో తెలుగు నుంచే ఉంటారని, ఆ అవకాశాలు ఎన్టీఆర్కి ఎక్కువ ఉన్నాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆమధ్య ఎన్టీఆర్ – రిషబ్ శెట్టి ఇద్దరూ కలిశారు కూడా. ఆ సమయంలోనే కాంతార 3కి సంబంధించిన చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. కాంతార 2లోనే ఎన్టీఆర్కి సంబంధించిన లీడ్ కూడా ఉండొచ్చు.
కాకపోతే పార్ట్ 3.. ఇప్పట్లో ఉండదు. కాస్త సమయం పడుతుంది. ఈ గ్యాప్లో రిషబ్ ఓ సినిమా పూర్తి చేస్తారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఈ చిత్రం రూపుదిద్దుకొంటుంది. అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తారు. ఆ తరవాతే… కాంతార 3 ఉంటుంది. నిజంగానే ఈ ఊహాగానాలు నిజమై ఎన్టీఆర్, రిషబ్ శెట్టి ఓ సినిమాలో కనిపిస్తే – బాక్సాఫీసుఏ దద్దరిల్లడం ఖాయం.