ఎన్టీఆర్ సినిమా అంటే బాక్సాఫీసు కొత్త కళ వస్తుంది.
రికార్డుల గురించి, వసూళ్ల గురించీ మాట్లాడుకొనే వీలు దొరుకుతుంది.
తెలుగు సినిమా స్టామినా బయటపడుతుంటుంది. ఆ జోష్ జనతా గ్యారేజ్‌లోనూ కనిపిస్తోంది.
టెంపర్, నాన్నకు ప్రేమతో విజయాలతో యమ ఫామ్‌లోకి వచ్చేసిన ఈ యమదొంగ.. ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేశాడు. ఈసారి కథని నమ్మి చేసిన సినిమా అని జనతా గ్యారేజ్ గురించి ఘంటాపథంగా చెబుతున్న ఎన్టీఆర్.. చెబుతున్న ముచ్చట్లు.
* హాయ్ ఎన్టీఆర్..
– హాయ్
* వరుసగా రెండో సినిమాలోనూ గెడ్డంతోనే కనిపిస్తున్నారు..
– నాన్నకు ప్రేమతో గెటప్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది కదండీ. ఆ స్థాయిలో గడ్డం పెంచలేదు. పైగా గడ్డం బాగుంది అంటున్నారు. అభయ్ రామ్ కూడా గడ్డంతో ఉన్నప్పుడు నన్ను గుర్తుపట్టే స్టేజ్ కి వచ్చాడు. కాబట్టి ప్రాబ్లం లేదు.
* మీ కెరీర్లో ఇంత ఫాస్ట్‌గా పూర్తయిన సినిమా ఇదేనేమో?
– కావొచ్చు. కొరటాల చాలా స్పీడ్‌గా తీశాడు. చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు ఆయన. ఎంత బాగా రాస్తారో అంత బాగా తీస్తారు. ఇంత పెద్ద సినిమా.. ఇంతమంది స్టార్స్ ఉన్నారు.. అయినా ఎక్కడా తొణకలేదు. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే, ఇంత తక్కువ టైమ్‌లో పూర్తయిందంటే ఆ క్రెడిట్ మొత్తం ఆయనదే.
* జనతా గ్యారేజ్ టైటిల్ మీకు చెప్పినప్పుడు ఏం అనిపించింది? మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి?
– ఈకథకు ఇంతకంటే మించిన టైటిల్ దొరకదు అనిపించింది. ఇది హీరోకి సంబంధించిన కథ కాదు. హీరోయిన్‌కి సంబంధించిన కథ కాదు. జనతా గ్యారేజ్‌కి చెందిన కథ. ఈ కథలో మేం భాగం మాత్రమే.
* రభస టైమ్‌లో చెబితే… నో అన్నార్ట
– నో అనలేదు. అప్పుడే బాగా నచ్చింది. కానీ నా కమిట్మెంట్స్ వల్ల చేయలేకపోయా. పైగా కొరటాల కూడా శ్రీమంతుడు సినిమాతో బిజీగా ఉన్నారు కదా?
* ఈ సినిమాతో నా గమ్యం నాకు కనిపించింది అన్నారు.. అలా అనడానికి కారణం ఏమిటి?
– ఈ కథనన్ను అంత ఇన్స్పైర్ చేసిందండీ. ఎలాంటి కథల కోసం నేను అన్వేషిస్తున్నానో.. అలాంటి కథ ఈ సినిమా రూపంలో దొరికింది. టెంపర్ కంటే ముందు విన్న కథ ఇది. అందుకే.. ఆ ప్రభావం నాపై ఉండిపోయింది. ఆ డైలాగులు, కొరటాల చెప్పిన కాన్సెప్ట్ నా మైండ్‌లో గిర్రున తిరిగేవి. ఆ ప్రభావంతోనే టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి మంచి కథల్ని ఎంచుకొన్నానేమో.
* మోహన్‌లాల్ ని తీసుకోవాలన్న ఆలోచన ఎవరిది?
– దర్శకుడిదే. ఆయన చెప్పగానే.. మోహన్‌లాల్‌గారిని మించిన ఆప్షన్ ఇంకోటి లేదనిపించింది. లక్కీగా ఆయన కూడా ఒప్పుకొన్నారు. నా జీవితానికి సరిపడ అనుభవం ఆయన దగ్గర్నుంచి నేర్చుకొన్నా. నటుడిగా ఎంత గొప్పవారో ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. మనిషిగా… ఆయన ఇంకా గొప్పవాడు.
* జనతా గ్యారేజ్ తరవాత ఎన్టీఆర్ కోసం కొత్త కథలు పుడతాయి అంటారా?
– నూటికి నూటొక్క శాతం. నా కోసం పుట్టకపోయినా.. పరిశ్రమకు మాత్రం కొత్త కథలు వస్తాయి. అందులో సందేహం లేదు.
* ఈమధ్య కాలంలో ఇండ్రస్ర్టీలో వచ్చిన మార్పుని గమనించారా?
– గమనించా. చాలా మంచి సినిమాలొస్తున్నాయి. ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు. కోటి రూపాయలతో తీసిన పెళ్లి చూపులు రూ.20 కోట్లు వసూలు చేయడం ఏమిటి? స్టార్ గురించి ఆడియన్స్ పట్టించుకోరనే విషయానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి?
* ఆడియన్స్ పట్టించుకోకపోయినా.. హీరోలు, దర్శకులు పట్టించుకొంటున్నారు కదా?
– మేం కూడా పట్టించుకోవడం లేదు. స్వతహాగా నాకు స్టార్ అనే పదం నచ్చదు. నన్ను ఓ నటుడిగానే చూస్తా. ఆ బ్యాగేజ్ నాకు వద్దు. ఎప్పుడైతే నటుడ్ని అనుకొంటానో అప్పుడే అన్ని పాత్రలూ చేయగలుగుతా. అమీర్ ఖాన్ని చూడండి. ఇప్పటికీ లవ్ స్టోరీలు చేస్తున్నారు. అలా ఉండాలంతా. మనం ఆ స్థాయికి ఎదగాలి.
* వసూళ్లు, రికార్డుల మాటేంటి?
– అవి కేవలం అంకెలు మాత్రమే. ట్రేడ్ వర్గాలు పుట్టించిన పదాలు. అవి ఎప్పుడు పుట్టాయో.. ఎవరి పుట్టాంచారో నాకు తెలీదుగానీ.. వాటి గురించి పట్టించుకోకపోవడమే మంచిది.
* అభిమానులు మాత్రం ఇవన్నీ పర్సనల్‌గా తీసుకొంటున్నారు. ఈమధ్య మీ అభిమానిపై హత్యానేరం కూడా మోపపడింది…
– ఈ విషయంలో నేను క్లియర్‌గా ఒకటి చెప్పదలచుకొన్నా. అలాంటి సందర్భంలో నా అభిమానులెవ్వరూ ఉండరు. ఒకవేళ ఉంటే.. వాళ్లు నా అభిమానులు కారు. దేశాన్ని ప్రేమించండి. కుటుంబాన్ని ప్రేమించండి. సొంత ఊరిని ప్రేమించండి. ఆ జాబితాలో మమ్మల్ని చిట్టచివర నిలబెట్టండి. సినిమా వేరు.. జీవితం వేరు. ఈ విషయాన్ని గుర్తించండి.
* మిగిలిన హీరోలతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది?
– హ్యాపీగా ఉంటుంది. మేం గొడవలు పడుతున్నట్టు ఎక్కడైనా వార్తలొచ్చాయా? కానీ మా అభిమానాన్ని చూపించుకొనే ఛాన్స్ రాలేదేమో. అంతే.
* మల్టీస్టారర్‌కు సిద్దమేనా?
– తప్పకుండా. మంచి కథ, దాన్ని డీల్ చేసే దర్శకుడు దొరకాలంతే.
* గుండమ్మ కథ తీస్తానన్నారు…
– చేయాలని నాకూ ఉంది. కానీ భయం వేస్తుంటుంది. గొప్ప క్లాసిక్ సినిమా అది. అలాంటి సినిమాల్ని చూస్తూ కూర్చుంటేనే మంచిది. పాడు చేయకూడదు. గ్రౌండ్ వర్క్ బాగా చేశాకే అలాంటి సినిమాల్ని ముట్టుకోవాలి.
* చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు చేస్తారా?
– అవి చేయాలన్నా భయమే. కానీ మంచి టీమ్ కుదిరితే తప్పకుండా చేస్తా.
* తదుపరి సినిమా ఏమిటి?
– ఇంకా అనుకోలేదు. జనతా గ్యారేజ్ తరవాత కొంత విరామం తీసుకొంటా. ఆ తరవాతే కొత్త సినిమా ఏమిటన్నది చెప్తా.