ఈమధ్య కాలంలో ఎన్టీఆర్ విన్నన్ని కథలు మరో హీరో వినలేదేమో..? ఒకటా రెండా.. జనతా గ్యారేజ్ తరవాత దాదాపు పదిమంది దర్శకులతో భేటీ అయ్యాడు ఎన్టీఆర్. వాళ్లు చెప్పిన సింగిల్ లైన్లు, ఫుల్ స్క్రిప్టులు అన్నీ విన్నాడు. కానీ ఏ కథ విషయంలోనూ క్లారిటీ తెచ్చుకోలేకపోయాడు. ‘ఇంతకు మించి’ కథ కావాలటూ ఐ సినిమాలో విక్రమ్ టైపులో అన్వేషణ మొదలెట్టాడు. తాజాగా ‘పవర్’ దర్శకుడు బాబి కూడా రవితేజకు ఓ కథ వినిపించాడు. ఇది సింగిల్ లైన్ స్టోరీ కాదు. ఏకంగా ఫుల్ స్క్రిప్ట్ నేరేషన్ ఇచ్చేశాడు. ఈ కథ కూడా ఎన్టీఆర్‌కి బాగా నచ్చిందట. అయితే.. నిర్ణయం మాత్రం ‘పెండింగ్’లో పెట్టినట్టు తెలుస్తోంది.
తాను విన్న కథలు మరోసారి విశ్లేషించుకొని, ప్రస్తుత ట్రెండ్కీ, తన ఇమేజ్‌కీ ఏ కథ సూటవుతుందో నిర్ణయించుకొందామని భావిస్తున్నాడట ఎన్టీఆర్. అయితే బాబి వరకూ ప్లస్ పాయింట్ ఏమిటంటే.. ”ఈ కథ ఇప్పుడు చేయకపోయినా.. ఎప్పటికైనా చేసే అవకాశం ఉంది” అని తెలుస్తోంది. బాబి చెప్పిన కథ అంత నచ్చిందన్నమాట. ఎన్టీఆర్‌కి తదుపరి సినిమాపై కొన్ని ఆలోచనలు ఉన్నాయని, తన ఐడియాలజీకి దగ్గరగా ఏ కథా లేకపోవడంతో ఎన్టీఆర్ ‘ఓకే’ చెప్పలేకపోతున్నాడని తెలుస్తోంది. కొంతమంది దర్శకులకు ‘ఇలాంటి కథ ఉంటే చెప్పు’ అంటూ తనే కొన్నిఇన్పుట్స్ ఇస్తున్నాడని, ఆ తరహా కథల్ని వెదికే పనిలో దర్శకులు పడ్డారని సమాచారం.