అమరావతిలోని నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణం విషయంలో కొంత కాలంగా సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. కొంత మంది రూ.1750 కోట్లు అని విమర్శలు చేస్తూంటే.. మరికొంత మంది కులాల పరమైన వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన ముసుగులో వైసీపీకి చెందిన వారు ఈ కుట్రల్ని అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ను దూషించడం దగ్గర నుంచి చాలా చేస్తున్నారు. కొంతకాలంగా ఇది జరుగుతున్నా ఇప్పుడు ప్రభుత్వం స్పందించింది. ఎన్టీఆర్ విగ్రహం పేరుతో ఎవరైనా దూషణలకు పాల్పడినా.. కుల చిచ్చు పెట్టినా సీరియస్ గా తీసుకుంటామని హెచ్చరికలు పంపింది. అయితే ఈ స్పందన ఇప్పటికే చాలా ఆలస్యం అయిది.
నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు కాదు.. అమరావతి మాస్టర్ ప్లాన్ లోనే ఆ విగ్రహాన్ని పెట్టారు. అప్పట్లో ఆగిపోయింది. ఒక్క ఎన్టీఆర్ విగ్రహం మాత్రమే కాదు.. పలు చోట్ల అంబేద్కర్, పొట్టి శ్రీరాములు ఇలా పలువురు మహనీయుల భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉండకూడదని.. విజయవాడలోని రద్దీ ప్రాంతంలోని గ్రౌండ్స్ లో హడావుడిగా కట్టించారు. ప్రభుత్వం మారిన మళ్లీ మాస్టర్ ప్లాన్ ప్రకారం యధావిధిగా విగ్రహాల నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రక్రియ ప్రారంభించారు. ఓ సందర్భంలో ఈ విగ్రహం ఏర్పాటుకు రూ. 1750 కోట్లు ఖర్చవుతాయని మంత్రి నారాయణ అన్నారు. అందుకే దాన్ని పట్టుకుని కొంత మంది కులపరమైన వ్యాఖ్యలతో వస్తున్నారు.
ఎన్టీఆర్ విగ్రహానికి నిధులు ఎలా సమీకరించాలన్నది ఇంకా నిర్ణయించలేదు. సీఆర్డీఏ కట్టడం లేదు. పీపీపీ విధానంలో కట్టేలా ప్లాన్ చేస్తున్నారు. పూర్తిగా ప్రైవేటు సంస్థతో కట్టించి.. నిర్వహణ కూడా ఆ సంస్థకే అప్పగించనున్నారు. ప్రజాధనం వెచ్చించడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయినా సరే తప్పుడు ప్రచారాలతో చాలా మంది ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. కానీ ఇప్పటికే ఆలస్యం అయిందన్న భావన వినిపిస్తోంది. కుల చిచ్చు పెట్టిన వాళ్లపై తక్షణం కేసులు పెడితే మిగిలిన వారు దారికి వస్తారని అంటున్నారు.
