ఓ మంత్రి, ఐఏఎస్‌లకు వివాహేతర బందం అంట గడుతూ వార్తా కథనం ప్రసారం చేసిన ఎన్టీవీ యాజమాన్యం క్షమాపణ ప్రకటించింది. తమ కథనం ఎవరినీ ఉద్దేశించినది కాదని ఎవరి మనోభావాలు అయిన దెబ్బతింటే క్షమాపణ కోరుతున్నామన్నారు. ఐఏఎస్ అధికారుల పట్ల తమకు చాలా గౌరవం ఉందని తెలుగు, ఇంగ్లిష్‌లలో ప్రకటన విడుదల చేశారు.
ఎన్టీవీ కథనం వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే కేసులు నమోదు చేసింది. విచారణకు సిట్ ను ఏర్పాటు చేసింది. దీంతో హడావుడిగా ఎన్టీవీ క్షమాపణలు కోరింది. కానీ కేవలం ఒక ప్రకటనతో క్షమాపణ చెబితే సరిపోతుందా? వ్యవస్థలను, అధికారులను లక్ష్యంగా చేసుకుని చేసే దాడులకు ఈ క్షమాపణలు విరుగుడు అవుతాయా? అన్న ప్రశ్నలు అధికార వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
విధి నిర్వహణలో ఉన్న అధికారుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రసారాలు చేసి, వివాదం ముదిరిన తర్వాత వెనక్కి తగ్గడం అనేది మీడియా నైతికతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. ఒక ఐఏఎస్ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సదరు అధికారి మనోభావాలతో పాటు, మొత్తం యంత్రాంగం యొక్క ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. అటువంటి సందర్భాల్లో కేవలం ‘విచారం వ్యక్తం చేస్తున్నాం’ అనే పదాలతో సరిపెట్టడం వల్ల భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయా అన్నది అనుమానమే.
బాధితులైన అధికారులు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ క్షమాపణలు కేవలం శిక్ష నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని కేవలం ఒక క్షమాపణ లేఖతో ముగించకుండా, భవిష్యత్తులో మీడియా హద్దులు దారకుండా ఉండేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాల ఐఏఎస్‌లు కోరుతున్నారు.
