సీరియస్ క్రైమ్ థ్రిల్లర్స్ తీసే దర్శకుడు జీతూ జోసెఫ్. ఆయన సినిమాలకి ఒక కల్ట్ ఫాలోయింగ్ వుంది. దృశ్యం సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఆదరించారు. ఇప్పుడాయన నుంచి ఓ క్రైమ్ కామెడీ వచ్చింది. అదే నునక్కుజి. మిన్నల్ మురళితో డైరెక్టర్ గా, జయ జయ జయ జయహే సినిమాతో నటుడిగా పాపులరైన బాసిల్ జోసెఫ్ ఇందులో లీడ్ రోల్ చేయడం మరో విశేషం. తాజాగా జీ5 ఓటీటీలో సినిమా రిలీజైయింది. జీతూ జోసెఫ్ మార్క్ కి భిన్నంగా సాగిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? ఈ క్రైమ్ కామెడీ నవ్వించిందా?
ఎబి జకరియా (బాసిల్ జోసెఫ్) ఓ పెద్ద కంపెనీకి మ్యానేజింగ్ డైరెక్టర్. తనకు వ్యాపారంలో అస్సలు ఆసక్తి వుండదు. తండ్రి చనిపోవడంతో విధి లేని పరిస్థితిలో ఆఫీస్ కి వస్తుంటాడు. తనకు కొత్తగా పెళ్ళయివుంటుంది. భార్యతో ఏకాంతగా గడిపిన క్షణాల్ని వీడియో తీసుకొని ఆఫీసులో చూసుకోవడం అతనికో వింత అలవాటు. ఓ రోజు ఆఫీస్ లో ఇన్ కమ్ టాక్స్ రైడ్ జరుగుతుంది. అధికారులు ఎబి పర్శనల్ వీడియోస్ వున్న లాప్ ట్యాప్ ని ఎత్తుకుపోతారు. ఈ సంగతి తెలుసుకున్న ఎబి భార్య నిప్పులు చేరుగుతుంది. ఎట్టిపరిస్థితిలో ఆ ల్యాప్ తీసుకురమ్మని గోల చేస్తుంది. దీంతో రాత్రిరాత్రికే ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇంటికి వెళ్తాడు ఎబి. తర్వాత ఏం జరిగింది? ఆ ల్యాప్ టాప్ ని తెచ్చుకునే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురుకునన్నాడు? ఫైనల్ గా లాప్ ట్యాప్ దొరికిందా లేదా? అనేది మిగతా కథ.
ఒక అబద్దాన్ని కప్పిపుచ్చడానికి వంద అబద్ధాలు ఆడాలి. నిజం కంటే అబద్ధంలో ఎక్కువ డ్రామా వుంటుంది. ఈ సినిమా కథ కూడా అలాంటి అబద్ధాల కారణంగా నడిచే కామెడీ డ్రామానే. ఈ సినిమా రైటర్ కెఆర్ కృష్ణ కుమార్. ఆయన ఇచ్చిన కథని తనదైన కాంప్లెక్స్ నెరేటివ్ లో చెప్పాలని చూశారు డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఈ ప్రయత్నం చాలా చోట్ల నవ్విస్తుంది. ఎబీ క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ కథ మొదలౌతుంది. ఆ క్యారెక్టర్ భలే గమ్మత్తుగా వుంటుంది. కథలో కాన్ఫ్లిక్ట్ కూడా రెండో సీన్ లోనే మొదలైపోతుంది.
సింపుల్ క్రైమ్ కామెడీ ఇది. కానీ జీతూ జోసెఫ్ ఇందులోనే తనదైన స్టయిల్ లో నెరేషన్ డిజైన్ చేశారు. ఎబి(బాసిల్ జోసెఫ్), రష్మిత( గ్రేస్ ఆంటోని) హీరో సుందర్ నాథ్ (మనోజ్ కె. జయన్) ఈ మూడు పాత్రలు మూడు ట్రాక్స్ గా వెళ్తుంటాయి. ఈ మూడు క్యారెక్టర్స్ ని ఇంటర్ లింక్ చేస్తూ కథ ముందుకు సాగుతుంటుంది. ఈ కాంప్లెక్స్ నెరేటివ్ కి కనెక్ట్ కాకపొతే మాత్రం ఇందులో ఫన్ ఎంజాయ్ చేసేలా వుండదు. ఆ పాత్రలు, వాటి తీరు ఒక నాటకంలా అనిపించే ఛాన్స్ వుంది.
ఒక్క రాత్రిలో జరిగే కథ ఇది. జరుగుతున్నది ఒక నేరమే అయినా ఆ పాత్రలన్నిటికీ హ్యుమర్ టచ్ ఇచ్చి కామెడీ అఫ్ ఎర్రర్ లా తీర్చిదిద్దారు. ఏం జరుగుతుందో క్యారెక్టర్స్ కి క్లారిటీ వుండదు. చూస్తున్న ఆడియన్స్ కి మాత్రం క్లారిటీ వుంటుంది. సస్పెన్స్ ని, ట్విస్ట్ లని ముందే ఓపెన్ చేసి పెడతాడు డైరెక్టర్. దీంతో ఈ కథ మొత్తం ప్రేక్షకుడి ఊహకి అందిపోతుంది. జీతూ జోసెఫ్ స్టయిల్ ట్విస్ట్ లు ఆశిస్తే మాత్రం నిరాశతప్పదు. అలాగే లిమిటెడ్ లోకేషన్స్ లో కథ నడుస్తుంది. సింగిల్ లోకేషన్స్ లోనే దాదాపు ఐదు నిమిషాలకి పాటు సాగే లెన్తీ సీక్వెన్స్ లో వుంటాయి. దీంతో చాలా చోట్ల ఇది నాటికలా అనిపించే ఛాన్స్ కూడా వుంది.
ఎబి గా బాసిల్ జోసెఫ్ అమాయకంగా కనిపించి నవ్వించాడు. రష్మితగా గ్రేస్ ఆంటోని ది కూడా సీరియస్ గా నవ్వులు పంచే క్యారెక్టరే. ఎబి భార్య పాత్రలో నిఖిలా విమల్ కనిపించింది మూడు సీన్లే అయినా మంచి ఎఫెక్ట్ వున్న క్యారెక్టర్ అది. కానీ ఆమె కథకు ఓ డైరెక్టర్ కథతో ముడిపెట్టడం ఓవర్ లిబర్టీ అనిపిస్తుంది. హీరో సుందర్నాథ్ గా చేసిన మనోజ్ కె. జయన్ నవ్విస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ భామకృష్ణన్గా సిద్ధిక్ మొదట సీరియస్ గా కనిపించినా తాగితే మనిషి కాడనే తరహాలో ఆ పాత్రని తీర్చిదిద్దడం బావుంది. కెమెరాపనితనం, మ్యూజిక్ మరీ అంతగా గొప్పగా లేవు. పరిమిత బడ్జెట్స్ లోనే సినిమా తీశారని అర్ధమౌతుంటుంది. తెలుగు డబ్బింగ్ పర్లేదు. ఇందులో క్రైమ్ వునప్పటికీ జీతూ జోసెఫ్ మార్క్ థ్రిల్లర్ కాదిది. ఓ మాములు క్రైమ్ కామెడీ డ్రామా చూడాలనే ఉద్దేశంతో మొదలుపెడితే కొన్ని నవ్వులని పంచగలిగే సినిమా ఇది. కాలక్షేపానికైతే ఎలాంటి ఢోకా ఉండదు.