ఆడ్ అండ్ ఈవెన్.. ముందుకీ,వెనక్కి

(సెటైర్)

`ఇదిగో జంబులింగం. నిన్నేనయ్యా, పొద్దున్నే నడిరోడ్డుమీద ఈ రివర్స్ గేర్ లో నడకేంటీ ? ఆగవయ్యా ఆగు…’ పట్టుకుని కుదేశాడు కామేశం.

`చూడు కామేశం. అనవసరంగా నా పనులకు అడ్డుతగలకు’ కోపంగా అన్నాడు జంబులింగం.

`అంత కోపమెందుకయ్యా, నువ్వా నా స్నేహితుడివాయె. నీ మంచీచెడు చూడాల్సిన బాధ్యత నాకుందయ్యా. ఇంతకీ ఏమిటీ నడక. నడిరోడ్డుమీద వెనక్కి నడవమని ఎవరూ నీకు చెప్పింది?’

`ఇది నా పాలసీ. అంతే’ చిరుకోపంగా సమాధానమిచ్చాడు జంబులింగం.

`చూడు మిస్టర్ లింగం. నీ పాలసీకి నేనేం అడ్డుతగలన్లే. వెనక్కి నడిచింది చాల్లేగానీ, ఇదిగో ఇలారా ఇక్కడ బెంచ్ మీద కూర్చుని మాట్లాడుకుందాం’

`సరే పద…’

`ఆఁ ఇప్పుడు చెప్పు. ఈ వెనక్కి నడిచే పాలసీ ఏంటీ ? ఎప్పుడు మొదలుపెట్టావు??’

`ఇవ్వాల్టి నుంచే మొదలుపెట్టాను’

`ఇలా వింత పాలసీలు పెట్టుకుంటూ గిన్నీస్ బుక్కు ఎక్కాలనుకుంటున్నావా? లేకపోతే పబ్లిసిటీ స్టంటా ?’ ఎగతాళి చేశాడు కామేశం.

`ఇదిగో చూడు కామేశం. నీకు లోకజ్ఞానం లేదు. టివీలు, పేపర్లు చూడవు. ఎప్పుడూ నీ బిజినెస్ గొడవే.. ‘

`ఇంతకీ ఏమిటంటావు ?’

`చెబుతా విను… మాలాంటి వాళ్లంతా, అంటే ఐటీ కంపెనీల్లో పనిచేసేవాళ్లమంతా జనవరి 1 నుంచి `ఆడ్ అండ్ ఈవెన్ వాకింగ్’ మొదలపెట్టబోతున్నాం తెలుసా ?’

`అవునా, నిజంగా నాకు తెలియదు. రకరకాల వాకింగ్స్ తెలుసు, కానీ ఈ `ఆడ్ అండ్ ఈవెన్’ వాకింగ్ ఏమిట్రా !’

`నెలలో బేసి సంఖ్యలు, అదేరా ఆడ్ నెంబర్స్ ఉన్న తేదీలు అలాగే సరి సంఖ్య అంటే ఈవెన్ నెంబరున్న తేదీలు వస్తుంటాయి కదా. వాటిని ఆధారంగాచేసుకుని ఈ పాలసీ తీసుకొచ్చారు మా వాళ్లు’

`అబ్బో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందే. ఏం చేస్తారేంటీ?’

`రోజువిడిచిరోజు వాకింగ్ స్టైల్స్ మార్చేస్తాం. ఆడ్ నెంబర్స్ ఉన్న తేదీల్లో ఇదిగో ఇందాక నువ్వు చూశావుగా, అలా బ్యాక్ వాక్ చేస్తాం. ఈవెన్ సంఖ్య ఉన్న తేదీల్లో ముందుకే నడుస్తాం. అదే ఆడ్ అండ్ ఈవెన్ వాకింగ్ పాలసీ’

`ఏడ్చినట్లుంది మీ పాలసీ’ చప్పరించేశాడు కామేశం.

`దీన్ని అంత తేలిగ్గా తీసిపారేయకు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇలాంటి పాలసీనే కార్లకు జనవరి 1 నుంచి పెట్టబోతున్నాడు తెలుసా..’

`అవునటగా, ఎవరో అంటుంటే విన్నాను. ఇంతకీ కేజ్రీవాల్ పాలసీకి మీ వెనక్కి నడిచే పాలసీకి ఎంటీ సంబంధం?’ నిలదీశాడు కామేశం.

`కేజ్రీవాల్ ఏమన్నాడు… ప్రైవేట్ కార్ల నెంబర్ ప్లేట్లమీద చివరి అంకెను బట్టి కారు బయటకుతీయమన్నాడా లేదా?. సరి సంఖ్య ఉంటే ఒక రోజు, బేసి సంఖ్య ఉంటే మరోరోజు.. అంటే ఏ కారైనా నెలలో 15రోజులే రోడ్డుమీద తిరగాలట. మిగతా రోజుల్లో కారు పార్కింగ్ ప్లేస్ ల్లో రెస్ట్ తీసుకుంటుంది. దీనివల్ల కాలుష్యం 50 శాతం తగ్గిపోతుందని అంటున్నారు’

`ప్లాన్ బాగానే ఉంది. కానీ, ఢిల్లీలాంటి మహానగరాల్లో పార్కింగ్ ప్లేస్ ని కూడా షేర్ చేసుకుంటారటగా… డే-నైట్ డ్యూటీలను బట్టి రాత్రిపూట ఒకళ్లు, పగటిపూట మరొకరు పార్కింగ్ చేసుకుంటారట. మరి అలాంటప్పుడు కేజ్రీవాల్ పాలసీతో గందరగోళ పరిస్థితి ఏర్పడదూ… ‘

`ఒకటి కాదు కామేశం కేజ్రీవాల్ ఆలోచన మంచిదే, కానీ ఎన్నో సమస్యలున్నాయి. రోజు విడిచిరోజు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మీద ఆధారపడాల్సిందే’

`అవును, ఆయన ఎంతగా రైళ్లు, బస్సులు పెంచినా నగర శివార్లలోని చాలా టౌన్ షిప్ లకు ఈ రెండూ అందుబాటులో లేవాయె. మరి అలాంటప్పుడు కష్టమే. అయినా కేజ్రీవాల్ ఇప్పుడు వెనక్కి తగ్గినట్లే ఉన్నారటగా’

`అవును కామేశం, జనవరి 1 నుంచి 20 రోజులు ఈ పద్ధతి పెట్టి చూస్తారట. బాగుంటే పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారట’

`ఎవరికి బాగుంటే ?!!’

`అదే నాకూ అర్థంకావడంలేదు. పైగా ఏదో దయతలచినట్లు ఆదివారాలు మినహాయింపు ఇస్తారట’

`నువ్వేం భయపడకు జంబులింగం. కేజ్రీవాల్ నెమ్మదిగా వెనకడుగు వేస్తున్నారు. నువ్వే చూస్తావుగా, వారంలో మరో రెండు రోజులు మినహాయింపు ఇస్తారు’

`అదే మాకు కావాలి. 15రోజులకు తోడుగా ఆదివారాలు ఆయనే పాలసీ విడిచిపెడుతున్నాడు. శనివారం ఎలాగో వీకెండాయె. శుక్రవారం ఈ పద్ధతి వద్దని ముస్లీం సోదరులు అంటున్నారట. అలాగే మిగతావారాలు కూడా వేరే మతాలవాళ్లు గట్టిగా పట్టుకుంటే బాగుంటుంది. ‘

`పోనీ కేజ్రీవాల్ ఒక పనిచేస్తే ఎలా ఉంటుందంటావ్ ?’ సలహా ఇస్తున్నట్లు ఫోజుపెట్టాడు కామేశం.

`ఏమిటో చెప్పు’

`ఢిల్లీలోని కంపెనీలు ఆఫీసులు నెలకు 15రోజులే నడిపిస్తే…’

`ఏడ్చినట్లుంది నీ ఐడియా, అప్పుడు పొల్యూషన్ సంగతేమోగానీ అభివృద్ధి కుంటుపడుతుంది. అలా కేజ్రీవాల్ ఎన్నటికీ చేయడు’

`మరిప్పుడు ఏంటీ చేయడం ?’

`ఏం చేయాలో తెలియకనే మేమంతా ఇదిగో బ్యాక్ వాక్ పాలసీ తీసుకొచ్చాం’

`అంటే కేజ్రీవాల్ కు నిరసనగా బ్యాక్ వాక్ చేస్తారా?’

`కాదు, సపోర్టీవ్ గానే’ అన్నాడు జంబులింగం

`అదేంటీ !’ ఆశ్చర్యపోయాడు కామేశం.

`ఢిల్లీలో అన్నికార్లు ఒకేరోజు ముందుకు వెళ్లవు. అలాగే మేమూ ముందుకెళ్లం. `వెనక్కి’ వెళ్లడంలో ఆయనా, మేమూ ఒకటని చాటిచెబుతాం, అంటే సపోర్ట్ చేసినట్లేగా…’ అంటూ పగలబడి నవ్వేసిన జంబులింగం క్షణం ఆగకుండా బ్యాక్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com