నాగార్జున – కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఓం నమో వేంకటేశాయ చిత్రం తెరకెక్కుతోంది. వెంకటేశ్వర స్వామి భక్తుడు హాథీరాం బాబా కథ ఇది. ఈ సంక్రాంతికి విడుదల చేద్దామనుకొన్నారు. పండగ సీజన్‌కి ఇలాంటి సినిమాలు రావడం సేఫ్ అని కె.రాఘవేంద్రరావు ఆలోచన. అందుకే సినిమా షూటింగ్ మొదలెట్టినప్పుడే సంక్రాంతికి వచ్చేస్తున్నాం అనే ప్రచారం మొదలైంది. అయితే.. నాగార్జున మాత్రం `రిలీజ్ డేట్ ముందే చెప్పొద్దు. ఆ టైమ్‌కి సినిమా రిలీజ్ చేయకపోతే లేనిపోని తలనొప్పులు వస్తాయి` అని ముందే చిత్రబృందాన్ని హెచ్చరించాడు. తాను కూడా `సంక్రాంతికి వద్దామనే ఉంది.. కానీ చెప్పలేం` అంటూ హింట్ ఇస్తూ వస్తున్నాడు. ఇప్పుడు నాగ్ అనుమామనే నిజమైంది. ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి ఎప్పుడో తప్పుకొంది. ఇప్పుడు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని ఇప్పుడు 2017 మార్చిలో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ దాదాపుగా 80 శాతం పూర్తయ్యింది. రాఘవేంద్రరావు టక టక షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్తో చాలా పని ఉంది. విజువల్ ఎఫెక్స్ట్ విషయంలో రాజీ పడితే.. దెబ్బతినడం ఖాయమని నాగార్జున భయపడుతున్నాడు. ఇది వరకు శిరిడీ సాయి విషయంలోనూ ఇదే పొరపాటు జరిగింది. గ్రాఫిక్స్ కాస్త తేడా కొట్టడం ఫలితంపై తీవ్ర ప్రభావం చూపించింది. అందుకే సినిమా ఆలస్యమైనా ఫర్వాలేదు.. వీఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకూడదని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారని సమాచారం. దాదాపు 30 శాతం సన్నివేశాలు గ్రాఫిక్స్‌కి ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ సినిమా ఆలస్యం అవ్వక తప్పడం లేదని టాక్. సంక్రాంతికి చిరు, బాలయ్యలు పోటీ పడుతున్నారు. ఫిబ్రవరిలోనూ బడా సినిమాలు రానున్నాయి. ఆ తరవాత.. మార్చిలో నిదానంగా వద్దామన్నది నాగ్ సరికొత్త ఆలోచన.