ఒకప్పుడు.. అంటే ఈటీవీ మొదలైన కొత్తగా అత్యంత చవగ్గా తెలుగు సినిమాలన్నింటినీ కుప్పలు తెప్పలుగా కొనేసింది ఈటీవీ. ఎవ్వరి దగ్గరా లేని శాటిలైట్ సినిమాలు ఈటీవీ దగ్గరే ఉన్నాయి. ఆణిముత్యాల్లాంటి ఆ పాత మధురాల్ని చూడాలంటే ఈ టీవీ ట్యూన్ చేయాల్సిందే. అయితే ఆ తర్వాతర్వాత శాటిలైట్ హక్కులకు డిమాండ్ ఏర్పడడం, భారీ రేట్లకు అమ్ముడు పోవడంతో.. ఈటీవీ శాటిలైట్ జోలికి వెళ్లలేదు. ఉన్న సినిమాలు చాల్లే.. కొత్తగా కొనడం అనవసరం అన్నట్టు తయారైంది ఈటీవీ పరిస్థితి. జెమిని, మాటీవీ, జీ తెలుగు ఛానళ్ల మధ్య శాటిలైట్ కోసం ముక్కోణపు పోటీ జరుగుతోందిప్పుడు. అలాంటిది.. ఈటీవీ ఇప్పుడు శాటిలైట్ హక్కులపై మళ్లీ దృష్టి సారించడం మొదలెట్టింది. తాజాగా రాఘవేంద్రరావు – నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓం నమో వేంకటేశాయ సినిమా శాటిలైట్ హక్కుల్ని ఈటీవీ చేజిక్కించుకొని మిగిలిన శాటిలైట్ ఛానళ్లకు షాక్ ఇచ్చింది.
సుమారు రూ.4 కోట్ల రూపాయలకు ఈటీవీ ఈ హక్కుల్ని దక్కించుకొన్నట్టు తెలుస్తోంది. ఈటీవీ ఓ సినిమాపై ఈ స్థాయిలో పెట్టిందంటే గొప్ప విషయమే. అంతకు ముందు అన్నమయ్య శాటిలైట్ రైట్స్ ఈటీవీ దగ్గరే ఉండేవి. ఈ సినిమా రూపంలో ఈటీవీకి బాగా గిట్టుబాటు అయ్యింది. బాహుబలి సినిమా రైట్స్ ఈటీవీకే దక్కుతాయని చెప్పుకొన్నారు. అయితే మరీ భారీ రేటు చెప్పడంతో ఈటీవీ డ్రాప్ అయ్యింది. రాఘవేంద్రరావు ఈ సినిమా శాటిలైట్ ఈటీవీకే ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకోవడం, ఆయన రంగంలోకి దిగి… ఈటీవీతో చర్చలు జరపడంతో ఓం నమో వేంకటేశాయ ఈటీవీ పరమైంది. మున్ముందు కూడా ఈటీవీ శాటిలైట్ హక్కుల కోసం మిగిలిన మూడు ఛానళ్లతో పోటీ పడుతుందో, లేదంటే అడపాదడపా ఇలా షాక్ ఇస్తుంటుందో చూడాలి.