బాహుబలి 2లోని యుద్ద సన్నివేశం లీకేజ్‌తో యావత్ టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. అయితే చిత్రబృందం త్వరగా తేరుకోవడం, ఇంటి దొంగల్ని పట్టుకోవడంతో కాస్త రిలాక్సేషన్ దొరికింది. ఇక మీదట ఇలాంటి పొరపాటు జరక్కుండా రాజమౌళి అండ్ టీమ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొంటోంది. అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బాహుబలి 2తో పాటు, మరో సినిమా కూడా అదే సమయంలో, అదే ముఠా చేతిలో లీక్ అయ్యింది. ఆ సినిమానే.. ఓం నమో వేంకటేశాయ. నాగార్జున – కె.రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని దృశ్యాలు కూడా ఆ లీకేజీ వీరుల దగ్గరకే ఉన్నాయట.
విజయవాడలో అసలు నిందితుడ్ని పట్టుకొన్నప్పుడు ఆ పెన్ డ్రైవ్‌లో ఓం నమో వేంకటేశాయ సీన్లూ దొరికాయని తెలుస్తోంది. అయితే… ఈ సీన్లను యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేయకపోవడం వల్ల… లీకేజీ బారీన పడలేదు. అయితే బాహుబలి దొంగల చేతికి.. ఓం నమో వేంకటేశాయ సీన్లు ఎందుకొచ్చాయన్నది అర్థం కాలేదు. ఈ రెండు సినిమాలకూ సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్ ఒకే చోట జరుగుతుండడంతో ఒకేసారి ఈ రెండు సినిమాల్లోని సన్నివేశాలు లీకై పోయాయేమో అని పోలీసులు, సైబర్ క్రైమ్ శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఏది ఏమైనా పెద్ద సినిమాలు తీస్తున్న నిర్మాతలు, దర్శకులు ఈ విషయమై ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకొంటే అంత మంచిది. లీకేజీల రూపంలో సినిమా బయటకు వచ్చేస్తే.. చాలా జీవితాలు బుగ్గిపాలు అవ్వడం ఖాయం. తస్మాత్ జాగ్రత్త!