కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో పెడితే చీల్చిచెండాడుతామని హరీష్ రావు ప్రకటించారు. అసెంబ్లీలోనే పెట్టబోతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. వచ్చే నెలలో జరగాల్సినన అసెంబ్లీ సమావేశాల్లో జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశడతారు. సభ్యులందరూ స్టడీ చేసే అవకాశం ఇచ్చిన తర్వాత చర్చకు పెడతారు. అప్పుడు బీఆర్ఎస్ తాను చాలెంజ్ చేసినట్లుగా చీల్చిచెండాల్సి ఉంటుంది. కానీ ఈ పని కేటీఆర్ లేదా హరీష్ రావు చేస్తే ఇంపాక్ట్ రాదు. ఆ పని చేయాల్సింది కేసీఆర్ మాత్రమే.
సర్వం కేసీఆరేనని జస్టిస్ ఘోష్ రిపోర్టు
కాళేశ్వరంపై అన్ని వివరాలు అధ్యయనం చేసిన తరవాత జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టులో. సర్వం కేసీఆరేనని తేల్చారు. అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకున్నారని.. ప్రతి దానికి ఆయనదే బాధ్యత అని తేల్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మరింత ఒత్తిడికి గురవుతోంది. ఈ ప్రాజెక్టు కేసీఆర్ మానస పుత్రిక కావడంతో. మొత్తం ఆయనకు అవగాహన ఉంది. ప్రతి విషయాన్ని సమర్థించుకోవడానికి.. కాంగ్రెస్ తీరును తప్పు పట్టడానికి ఆయన వద్ద సమాచారం ఉంటుంది. అందుకే.. కేసీఆర్ ఇప్పుడు తన వాదనలను అసెంబ్లీలో వినిపించాల్సి ఉంది.
కేసీఆర్ గట్టిగా మాట్లాడితేనే ప్రజల్లోకి !
అసెంబ్లీకి వచ్చి.. కాళేశ్వరం రిపోర్టుపై ప్రతి విషయాన్ని ప్రజలకు కేసీఆర్ వివరించాల్సి ఉంది. జస్టిస్ ఘోష్ రిపోర్టులో వేటిని ఎగ్గొట్టారు.. వేటిని దాచి పెట్టారు.. తమపై నిందలు వేసేందుకు ఎలా ప్రయత్నించారో కేసీఆర్ ప్రజల ముందు పెట్టాల్సి ఉంది. ఆయన రాకుండా హరీష్ రావు మాట్లాడితే ప్రజల్లోకి అంత గొప్పగా వెళ్లదు. కానీ కాంగ్రెస్ అదే పనిగా ఎదురుదాడి చేస్తుంది. అదే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇక్కడ ప్రధాన పాత్రధారి..సూత్రధారి కేసీఆర్ అని ప్రచారం జరుగుతోంది. ఆయన వాదనలు వినిపించేందుకు అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అసెంబ్లీకి రాకపోతే విమర్శలు కాదు.. ఆయన తన వాదన చెప్పుకునే అవకాశాన్ని కోల్పోతారు.
ప్రజాస్వామ్యంలో స్థాయిలు ప్రజలే నిర్ణయిస్తారు !
కేసీఆర్.. తాను ఏంటి.. రేవంత్ ముందు ప్రతిపక్ష నేతగా కూర్చోవడం ఏమిటి అన్న భావనలో ఉండవచ్చు. తాను సభా నాయకుడిగా ఏళ్ల తరబడి వ్యవహరించిన చోట.. వేరే వ్యక్తి సభానాయకుడిగా ఉండటాన్ని ఆయన భరించలేకపోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఇలా అనుకుంటే.. ముందుకు సాగడం కష్టం. ప్రజలు ఇచ్చిందే పొజిషన్. కేసీఆర్కు ఆ విషయం తెలియనిదేం కాదు. కానీ జీర్ణించుకోవడం కష్టం. అవన్నీ అధిగమిస్తేనే…. బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్ కు వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అందుకే కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారని.. కాళేశ్వరం రిపోర్టును చీల్చి చెండాడుతారని బీఆర్ఎస్ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి.