దేశంలో ఆపరేషన్ లోటస్ సరికొత్త వేగంతో దూసుకుపోతోందని, ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ , తృణమూల్ కాంగ్రెస్ , శివసేన వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు నిలువునా చీలిపోవడమే దీనికి నిదర్శనం. దీనిపై మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం చే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కేవలం ఒక మూగ సాక్షి గా మిగిలిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూట్వీట్ చేశారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. నేడు ఏ చట్టాన్ని చూసి చిదంబరం గగ్గోలు పెడుతున్నారో, ఆ చట్టాన్ని తెచ్చింది, అందులో తమకు అనుకూలమైన లూప్‌హోల్స్ పెట్టుకుంది స్వయంగా కాంగ్రెస్ పార్టీయే. దాన్ని ఆయన కన్వీనియంట్‌గా మరచిపోతున్నారు.
కాంగ్రెస్ మార్క్ ఫిరాయింపుల రాజకీయం.. నాడే పడిన పునాది!
భారత రాజ్యాంగంలో 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్‌ను అప్పటి రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చింది. ‘ఆయా రామ్, గయా రామ్’ సంస్కృతికి అడ్డుకట్ట వేయడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం అని నాడు ప్రచారం చేసినప్పటికీ, భవిష్యత్తులో తాము ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి వీలుగా కొన్ని లూప్‌హోల్స్‌ను చట్టంలోనే ఉద్దేశపూర్వకంగా ఉంచారు. ముఖ్యంగా మూడో వంతు మంది సభ్యులు విడిపోతే అది చీలిక కిందకే వస్తుంది, వారిపై అనర్హత వేయలేరు అనే నిబంధనను నాడు కాంగ్రెస్ తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టుకుంది. ఆ తర్వాత 2003లో 91వ సవరణ దీనిని 2/3 వంతుకు మార్చినప్పటికీ, స్పీకర్ అధికారాల పరిధిని, విలీన ప్రక్రియల లూప్‌హోల్స్‌ను ఎవరూ సరిచేయలేదు.
చరిత్ర పునరావృతం
1970, 80ల కాలంలో జనతా పార్టీ సహా పలు ప్రాంతీయ ప్రభుత్వాలను గవర్నర్ వ్యవస్థను వాడుకుని, ఫిరాయింపులను ప్రోత్సహించి పడగొట్టిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్‌ది. నాడు తాము సృష్టించిన వైరస్’ . నేడు మరింత అప్‌గ్రేడ్ అయి ఆపరేషన్ లోటస్ రూపంలో తమ మిత్రపక్షాలపై దాడి చేస్తుంటే కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ నీతులు చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీ ఈ 10వ షెడ్యూల్లోని లోపాలను అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటోంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను విచ్ఛిన్నం చేసినా, ఇటీవల బెంగాల్ లో టీఎంసీ ఎంపీల తిరుగుబాటు గానీ, ఒడిశాలో బీజేడీ, దిల్లీలో ఆప్ శ్రేణుల చీలికల వెనుక గానీ బీజేపీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించలేదు.
రాజ్యాంగం ప్రకారమే చేస్తున్న బీజేపీ
చట్టంలో ఉన్న ‘మూడింట రెండు వంతుల ’ నిబంధనను పక్కాగా వాడుకుంటూ, సాంకేతికంగా అనర్హత వేటు పడకుండా గ్రూపులను విడదీస్తోంది. కనీసం స్పీకర్ నిర్ణయాలను ఆలస్యం కూడా చేయడం లేదు. అవసరమైతే రాజీనామాలు చేయిస్తోంది. రాజ్యసభ సభ్యుల రాజీనామాలే దీనికి సాక్ష్యం. పి. చిదంబరం లాంటి రాజకీయవేత్త 10వ షెడ్యూల్ మూగసాక్షిగా మారిందని ట్వీట్ చేయడం వెనుక ఉన్నది నైతిక ఆవేదన కాదు, కేవలం రాజకీయ నిస్సహాయత మాత్రమే. చట్టాన్ని తెచ్చినప్పుడే ఎలాంటి లూప్‌హోల్స్ లేకుండా, ఫిరాయించిన మరుక్షణమే పదవి ఊడిపోయేలా కఠినమైన నిబంధనలు పెట్టి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అధికారం చేతిలో ఉన్నప్పుడు చట్టాలను లూప్‌హోల్స్‌తో నింపి, నేడు ప్రత్యర్థులు అదే అస్త్రాన్ని ప్రయోగిస్తుంటే ఏడవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఆపరేషన్ లోటస్ ను తప్పుపట్టే ముందు.. దానికి పునాది వేసిన తమ స్వయంకృతాపరాధాన్ని కూడా కాంగ్రెస్ అంగీకరించక తప్పదు.
