ఇది ప్ర‌తిప‌క్షం త‌న అభ్య‌ర్థిని అవ‌మానించ‌డ‌మే

గోపాల‌కృష్ణ గాంధీ… మ‌హాత్మా గాంధీ మ‌నుమ‌డు. ఆయ‌న‌కో అవ‌మానం ఎదురైంది. అదీ త‌న‌ను ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎన్నుకున్న కాంగ్రెస్ చేతిలోనే. ఎవ‌రైనా ప‌ద‌వికి ఎన్నికైన త‌ర‌వాత ఆ వ్య‌క్తికి అభినంద‌న‌లు చెబుతారు. ఈసారి అందుకు భిన్నంగా జ‌రిగింది. కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార శాఖ మంత్రి వెంక‌య్య‌నాయుడును అధికార ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఎంపిక చేసినట్లు తెలియ‌గానే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు ఆయ‌న‌ను అభినంద‌న‌ల్లో ముంచెత్తారు. రాజ్య‌సభ‌లోనే ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం విశేషం. అభినందించిన వారిలో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ సైతం ఉండ‌టం విశేషం. అంటే తాము ఓట‌మిని అంగీక‌రిస్తున్నామ‌ని నామినేష‌న్ వేయ‌క‌ముందే ప్ర‌తిప‌క్షం అంగీక‌రించేసిన‌ట్ల‌య్యింది. త‌మ ఓట‌మి ఖాయ‌మ‌ని తెలిసిన‌ప్పుడు అస‌లు పోటీకి నిల‌ప‌డ‌మెందుకు? అదీ జాతి పిత మ‌న‌వ‌ణ్ణి పోటీ చేయ‌మ‌ని కోర‌డ‌మెందుకు? ఇది మ‌హాత్ముని అవ‌మానించ‌డం కాదా? చారిత్ర‌క త‌ప్పిదాలు చేయ‌డం ఇంత‌వ‌ర‌కూ క‌మ్యూనిస్టు పార్టీల‌కే అల‌వాట‌ని అనుకున్నాం. ఆ వాస‌న‌లు కాంగ్రెస్‌కు సోకిన‌ట్టు అనిపిస్తోంది క‌దూ. ఓడిపోతామ‌నుకున్న‌ప్పుడు జాతి నిరంత‌రం స్మ‌రించుకునే మోహ‌న్ దాస్ క‌రమ్ చంద్ గాంధీ వార‌సుల‌ను ఎందుకు ఎంపిక చేశారో అర్థం కావ‌డం లేదు. నాబోటి సామాన్యుణ్ణి ఎంపిక చేసుంటే స‌రిపోయేది. ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో పోటీ చేసిన ఘ‌న‌త ద‌క్కేది. రికార్డు బుక్కుల్లోకి ఎక్కేది. గోపాల కృష్ణ గాంధీకి ఇటువంటి ఖ‌ర్మ ఎందుకు? ఆయ‌నే తిర‌స్క‌రించి ఉండుంటే హుందాగా ఉండేది. అంకెల‌న్నీ అధికార ప‌క్షానికి అనుకూలంగా ఉన్న‌ప్పుడు ఏక‌గ్రీవానికి అంగీక‌రించుంటే ప్ర‌తిప‌క్షం హుందాత‌నం నిల‌బ‌డేది. త‌న బ‌లం ఎంతుందో తెలుసుకోడానికీ.. క్రాస్ ఓటింగుల‌కూ తావివ్వ‌డానికి త‌ప్ప ఈ ఎన్నిక ప్ర‌హ‌స‌నం ఎందుకూ ప‌నికిరాదు. కాదంటారా!

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com