కోకాపేట ఇప్పుడు చాలా మందికి అందడం లేదు. కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ ఈ ప్రాంతం ముఖచిత్రాన్నే మార్చేసింది. ఈ నియోపోలిస్ క్లస్టర్, భవిష్యత్తులో గ్లోబల్ కంపెనీలకు చిరునామాగా మారబోతోంది. దీని ప్రభావంతో కోకాపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ధరలు చదరపు అడుగుకు సగటున 9,000 నుండి 15,000 వరకు పెరిగాయి. అందుకే అందరూ ఆ ప్రాతానికి దగ్గరలో ఉన్న ఇతర ప్రాంతాల వైపు చూస్తున్నారు.
మోకిల, శంకర్పల్లి, కొల్లూరు కొనుగోలుదారులకు మంచి ఆప్షన్. కోకాపేట నియోపోలిస్‌కు కేవలం 15 నుండి 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ల అనుసంధానం ఈ ప్రాంతాలకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఇక్కడ ఇంకా ధరలు అందుబాటులో ఉండటమే కాకుండా, పచ్చదనంతో కూడిన ప్రశాంతమైన వాతావరణం లభిస్తోంది. ముఖ్యంగా కొల్లూరు, తెల్లాపూర్ ప్రాంతాలు ఇప్పుడు నయా కోకాపేట గా మారుతున్నాయి. ఇక్కడ భారీ హైరైజ్ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు వెలుస్తున్నాయి.
మరోవైపు విల్లా ప్లాట్లు లేదా ఓపెన్ ప్లాట్లపై ఆసక్తి ఉన్నవారికి మోకిల, శంకర్పల్లి రోడ్డు అద్భుతమైన వేదికగా మారింది. రీజినల్ రింగ్ రోడ్ ప్రతిపాదనలు, గ్రీన్ జోన్ పరిమితులు ఉన్నప్పటికీ, ఇక్కడ వెలుస్తున్న లగ్జరీ విల్లా ప్రాజెక్టులు భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఇస్తాయని భావిస్తున్నారు. కోకాపేట ప్రభావంతో ఈ రూట్లో ఉన్న భూముల విలువ గత రెండేళ్లలో 40 శాతం వరకు పెరిగింది. రిటైర్మెంట్ హోమ్స్ లేదా వీకెండ్ విల్లాల కోసం చూసేవారు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు.
వీటితో పాటు భానుర్, పటాన్చెరు పరిసర ప్రాంతాలు కూడా ఇప్పుడు రేసులోకి వచ్చాయి. ఇక్కడ పారిశ్రామికాభివృద్ధితో పాటు రెసిడెన్షియల్ డిమాండ్ కూడా పెరుగుతోంది. కోకాపేటలో పెట్టుబడి పెట్టలేకపోయిన చిన్న , మధ్య తరహా పెట్టుబడిదారులు, ఈ శివారు ప్రాంతాల్లో ప్లాట్లు కొంటున్నారు.