టెక్ దిగ్గజం ఒరాకిల్ ఉద్యోగులకు షాకిచ్చింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజున అంటే మార్చి 31న 30 వేల వర్క్ ఫోర్స్ ను తగ్గించుకుంది. తెల్లవారుజామున 6 గంటలకు ఉద్యోగుల ఇన్‌బాక్స్‌లలో ప్రత్యక్షమైన ఒకే ఒక్క ఈమెయిల్ తో అందర్నీ నిరుద్యోగుల్ని చేసింది. సంస్థలో జరుగుతున్న వ్యవస్థీకృత మార్పుల వల్ల మీ సేవలు ఇకపై అవసరం లేదు అన్న క్లుప్త సందేశంతో సుమారు 30,000 మందిని తొలగించడం ఇప్పుడు టెక్ ప్రపంచంలో అతిపెద్ద బ్లడ్‌బాత్ గా మారింది.
ఏఐ రేసులో భారీ మూల్యం!
ఒరాకిల్ ఇలా చేయడానికి ఆ సంస్థ నష్టాల్లో లేదు. భారీ లాభాల్లో ఉంది. అయినా ఇంత భారీ స్థాయిలో కోతలు విధించడానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ . మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలతో పోటీ పడి ఓపెన్ ఏఐ వంటి సంస్థలతో కుదుర్చుకున్న భారీ ఒప్పందాల కోసం ఒరాకిల్ వేల కోట్ల డాలర్లను వెచ్చించాల్సి వస్తోంది. ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం , క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అవసరమైన సుమారు నిధులను సమకూర్చుకోవడానికే ఈ లేఆఫ్స్ చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. అంటే, భవిష్యత్తు సాంకేతికత కోసం ప్రస్తుత మానవ వనరులను ఒరాకిల్ బలిపీఠం ఎక్కించిందని అర్థం చేసుకోవచ్చు. ని
అత్యధికంగా ఉద్యోగులు పోగొట్టుకుంది భారతీయులే
ఒరాకిల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,62,000 మంది ఉద్యోగుల్లో ఏకంగా 18 శాతం మందిపై ఈ వేటు పడగా, అందులో భారతదేశం నుంచే అత్యధికులు ఉన్నారు. మన దేశంలో ఒరాకిల్‌కు సుమారు 28,000 మంది ఉద్యోగులు ఉండగా, తాజా సమాచారం ప్రకారం దాదాపు 12,000 మంది భారతీయ ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్ , సపోర్ట్ విభాగాల్లోని సీనియర్ డెవలపర్ల నుంచి మేనేజర్ల వరకు అందరినీ ఈ కోతలు తాకాయి. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, ఈమెయిల్ వచ్చిన వెంటనే కంపెనీ సిస్టమ్స్ , సర్వర్ల యాక్సెస్‌ను కట్ చేయడం యాజమాన్యం అనుసరించిన క్రూరమైన పద్ధతిని సూచిస్తోంది.
ప్రాజెక్టుల భవితవ్యం ఏమిటి?
ఇంత హఠాత్తుగా వేలాది మందిని తీసేస్తే రన్నింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. అయితే, ఒరాకిల్ ఇప్పుడు తన అంతర్గత కార్యకలాపాలకు కూడా ఏఐ ఆటోమేషన్‌ను విరివిగా వాడుతోంది. మనుషులు చేసే పనులను సాఫ్ట్వేర్ బాట్ల ద్వారా పూర్తి చేయవచ్చనే ధీమాతోనే ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అనుభవజ్ఞులైన ఉద్యోగులు లేకపోవడం వల్ల దీర్ఘకాలంలో క్లయింట్ సపోర్ట్ , సాఫ్ట్వేర్ నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది.
ఈ ఏడాది లేఆఫ్‌ల బ్లడ్ బాత్ ఖాయం
కేవలం ఒరాకిల్ మాత్రమే కాదు, 2026 ప్రారంభం నుండి టెక్ రంగంలో లేఆఫ్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 70కి పైగా కంపెనీలు సుమారు 45,000 మందిని తొలగించాయి. ఇందులో అమెజాన్ అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు ఒరాకిల్ దాన్ని మించిపోయింది. కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి , ఏఐ వైపు మళ్లడానికి కాస్ట్ కటింగ్ అనే మంత్రాన్ని జపిస్తున్నాయి. నిన్నటి వరకు కోడింగ్ తెలిస్తే చాలనుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగికి, నేడు ఏఐతో పోటీ పడటం ఒక పెద్ద సవాలుగా మారింది.


