థియేటర్ల రాబడిని ఓటీటీలు చాలా వరకూ లాగేసుకొన్నాయి. ఈ జనరేషన్ ఓటీటీలకు అలవాటు పడిపోయింది. థియేటర్లోనే చూడాల్సిన సినిమా అనిపిస్తే తప్ప, ఓటీటీల్ని వదలడం లేదు. బాగున్న సినిమాల్ని అటు థియేటర్లోనూ, ఇటు ఓటీటీలోనూ చూస్తున్నారు. ప్రతీ వారం ఓటీటీలో ఏదో కొత్త స్టఫ్ వస్తోంది. దాంతో వీకెండ్ గడిచిపోతోంది. ఈఎంఐ, ఇంటి అద్దె, కరెంట్ బిల్, ఫోన్ బిల్ లిస్టుల్లో ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కూడా చేరిపోయింది. ఇప్పుడు ఈ అలవాటుని అలుసుగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. నెలవారీ సబ్ స్క్రిప్షన్ రేట్లు మెల్లమెల్లగా పెంచుకొంటూ పోతున్నాయి. ఇప్పుడు కంటెంట్ మధ్యలో యాడ్స్ గుప్పిస్తూ, అవి లేకుండా చూడాలంటే అదనంగా మరికొంత చెల్లించాల్సిందే అనే షరతు విధిస్తున్నాయి. హాట్ స్టార్ లో ఈ పద్ధతి ఉంది. ఇప్పుడు అమేజాన్ ప్రైమ్ కూడా అదే ఫాలో కాబోతోంది. వచ్చే నెల నుంచి యాడ్ ఫ్రీ కంటెంట్ చూడాలంటే ఎగస్ట్రా పే చేయాలంటూ ఇప్పుడు ఓ కొత్త నిబంధన జోడించింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ పద్ధతి అమలు చేసింది. ఇప్పుడు మనదేశంలో కూడా యాడ్ ఫ్రీ పేరుతో అదనంగా సొమ్ము చేసుకోవాలనుకొంటోంది.
ఓటీటీలు నిత్యావసరాల్లో భాగాలైపోయాయి. ఇది కాదనలేని వాస్తవం. కానీ థియేటర్లకు ఓటీటీల నుంచి ఎలా ముప్పు పొంచి ఉందో, ఓటీటీలకు పైరసీ సైట్ల నుంచి అలాంటి ముప్పే ఉంది. యేడాదికి సబ్స్క్రిప్షన్ తీసుకొని కూడా, మళ్లీ యాడ్ ఫ్రీ కోసం మరి కొంత చెల్లించాలంటే ఎవరికైనా బాధే. అలాగని మధ్యమధ్యలో వచ్చే యాడ్స్ భరించలేరు. అది సినిమా మూడ్ ని దెబ్బ తీస్తుంది. కాబట్టి కచ్చితంగా ప్రేక్షకులు ప్రత్యామ్నాయ మార్గాల్ని వెదుకుతారు.
ఇప్పటికే బప్పమ్, మూవీ రూల్స్ ఓటీటీ ఆదాయానికి గండి కొడుతున్నాయి. ఓటీటీలో కంటెంట్ వచ్చిన మరు క్షణం ఈ పైరసీ సైట్లలో ఆయా సినిమాలు హెచ్ డీ క్వాలిటీతో దిగిపోతున్నాయి. వాటి వల్ల ఓటీటీల ఆదాయానికి చిల్లు పడుతోంది. ఇప్పుడు యాడ్స్ పేరుతో రెవిన్యూ మరింత సంపాదించాలనే ప్లాన్ కూడా ఓటీటీల నుంచి ప్రేక్షకుల్ని దూరం చేసేదే.
నిజంగా ఓటీటీలకు ప్రేక్షకుల నుంచి మరింత ఆదాయం రాబట్టాలని ఉంటే, ముందుగా పైరసీని అరికట్టాలి. విడుదలైన రోజే పైరసీ సైట్లలో హెచ్ డీ ప్రింటుతో సినిమాలు వచ్చేస్తే… ఆ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యేంత వరకూ ఎవరు ఆగుతారు? ఒకవేళ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఉన్నా ఆ సినిమాని పైరసీ సైట్లలోనే చూస్తారు. క్రమంగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ తగ్గుమొహం పడతాయి. పైరసీ అనేది నిర్మాతలకే కాదు, ఓటీటీ సంస్థల్నీ తినేసే చీడ పురుగు. ముందు వాటిని ఆపడానికి ప్రయత్నించాలి. కంటెంట్ లో క్వాలిటీ పెంచాలి. అప్పుడు వినియోగదారుడు మరో వంద రూపాయిలు అదనంగా చెల్లించడానికైనా వెనుకంజ వేయడు. అలాంటి ప్రయత్నాలేం జరక్కుండా, ప్రేక్షకుల నుంచి కొత్త కొత్త దారుల్లో డబ్బులు గుంజాలని చూస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.