మంత్రి మల్లారెడ్డికి సొంత పార్టీలో కేసీఆర్ ఫుల్ సపోర్ట్ గా ఉన్నా.. ఆయన జిల్లాలో ఇతర ఎమ్మెల్యేలు మాత్రం వ్యతిరేకమయ్యారు. మేడ్చల్ జిల్లాకు ఏకైక మంత్రిగా మల్లారెడ్డి ఉన్నారు. ఆ జిల్లా పరిధి అంతా గ్రేటర్ లోకే వస్తుంది. దాదాపుగా అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ మల్లారెడ్డి మాత్రం కేసీఆర్ వద్ద ఉన్న చనువుతో .. ఏకపక్ష పాలన చేస్తున్నారు. ఈ కారణంగా మిగతా ఎమ్మెల్యేలు అంతా డమ్మీలైపోయారు. ఇలా అయితే తమకు కష్టం అని అందరూ.. ఏకతాటిపైకి వచ్చేశారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో.. కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, శేరిలింగంపల్లి అరికపూడి గాంధీ సమావేశం అయ్యారు. తమను మల్లారెడ్డి అసలు పట్టించుకోవడం లేదని.. తమ పనులు కావడం లేదని.. మల్లారెడ్డి అనుచరులకే మొత్తం పదవులు పంచుతున్నారని వారు మండిపడుతున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా మల్లారెడ్డి ఉన్నారు. జిల్లాకు సంబంధించిన ఎలాంటి పదవులనైనా తనకు కావాల్సిన వారికే, మేడ్చల్ జిల్లా పదవులను సైతం ఆ నియోజకవర్గ వారికే ఇస్తున్నారని ఈ ఎమ్మెల్యేల ప్రధాన ఆరోపణ.
ఐదుగురు ఎమ్మెల్యేలు ఒకే సారి సమావేశం కావడంతో బీఆర్ఎస్ హైకమాండ్ కూడా ఉలిక్కి పడింది.వెంటనే అందర్నీ ప్రగతి భవన్కు ఆహ్వానించింది. ప్రగతి భవన్లో ఏదో ఒకటి సర్ది చెబుతారు. రాజకీయంగా సున్నితంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు భేటీకావడం అంటే చిన్న విషయం కాదు.అందుకే పార్టీ హైకమాండ్ కూడా రంగంలోకి దిగింది. మల్లారెడ్డి వ్యాపార సంస్థలపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. అయినా ఆయన ఏ మాత్రం లొంగకుండా కేసీఆర్ పై అపరిమితమైన విశ్వాసం ప్రకటించారు. దీంతో ఆయనకు హైకమాండ్ వద్ద పలుకుబడి మరింత పెరిగింది. ఇది మిగతా ఎమ్మెల్యేలను మరింత ఇబ్బందికి గురి చేస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపించకపోతే తాము డమ్మీ అయిపోతామని వారు ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది.