ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతీది రాజకీయం అయిపోతోంది. ఇది పేదలకు అన్యాయం చేస్తోంది. తాజాగా P4 అనే కార్యక్రమంపై జరుగుతున్న ప్రచారంతో పేదలకు భారీ ఎత్తున నష్టం జరగనుంది. ఆ పథకం ఉద్దేశం గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు.
P4కి ప్రభుత్వం ఫెసిలిటేటర్ మాత్రమే
సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనుకునే వాళ్ల కోసమే చంద్రబాబు P4 ఆలోచన చేశారు. చాలా మంది జీవితంలో పైకి ఎదిగిన వారికి ఇతరులు ఎదగడానికి.. ముఖ్యంగా పేద కుటుంబాలు బాగుపడటానికి తమ వంతు సాయం చేయాలని అనుకుంటారు. అది ఆర్థికంగా మాత్రమే కాదు.. వారికి మార్గదర్శకులుగా వ్యవహరించడం ద్వారా కూడా సాధ్యమే. అందుకే అలాంటి వాళ్లందరికీ ప్రభుత్వం ఫెసిలిటేటర్ గా ఉండి… మార్గదర్శకులు.. పేద కుటుంబాలకు మధ్య అనుబంధం ఏర్పాటు చేస్తోంది.
స్వచ్చందం అయితేనే విజయవంతం
పారిశ్రామికవేత్తలు, సేవా గుణం ఉన్న వారు మాత్రమే మార్గదర్శకులుగా ఉండగలరు. అంతే కానీ ఉపాధ్యాయులు లేదా ఇతరులు ఉండలేరు. కానీ ఈ పథకంలో కుటుంబాలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని కొంత మంది ఆరోపిస్తున్నారు. కానీ ఇది స్వచ్చందమని….ఎవరిపై ఒత్తిడి లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిర్బంధంగా ఓ కుటుంబానికి మార్గనిర్దేశకత్వం చేయడం సాధ్యం కాదు. సేవ చేయాలని.. ఆ కుటుంబాన్ని పైకి తీసుకు రావాలన్న భావన ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం ఎవరినైనా బలవంతం చేస్తే అది ఈ ప్రయత్నం విఫలమవడానికి కారణంగా నిలుస్తుంది.
పేదలకు కావాల్సింది ఎదిగేందుకు కావాల్సిన సాయం
పేదలు ఎప్పుడూ తాము పేదరికంలోనే ఉండాలని కోరుకోరు. ప్రభుత్వాల మీద ఆధారపడి బతికిపోవాలని అనుకోరు. తమ కాళ్లపై తాము నిలబడటాన్ని గర్వంగా భావిస్తారు. అయితే పేదరికం, అవకాశాలను అందుకోలేని అజ్ఞానం, ఉన్నత చదువుల సమస్యలు ఇలా అనేక ఆటంకాలు పేదలకు ఉంటాయి. అంతకు మించి సరైన దారి చూపించేవారు ఉండరు. ఇందులో డబ్బుతో పరిష్కారమయ్యేవి చాలా చిన్నవి. వారికి అవగాహన కల్పించి.. వారి కుటుంబ పరిస్థితుల ఆధారంగా ఎదిగేలా చేయడం అనే కాన్సెప్ట్ స్ఫూర్తి ఎక్కువ.
ఈ ప్రయత్నం విజయవంతం అయితే ఏపీలో పేదల బతుకులు మారిపోతాయి. ఓ కొత్త ప్రయత్నం జరుగుతున్నప్పుడు బండలు వేయడం కన్నా… ప్రోత్సహించడం మంచిది. దీని వల్ల జరిగితే మంచే జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు.