బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎక్కువగా హడావుడి చేసే పాడి కౌశిక్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం ఎదురయింది. హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపించింది. మొత్తం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 16 వార్డులను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేయగా, బీఆర్ఎస్ కేవలం 8 స్థానాలకే పరిమితమై అధికార పార్టీకి గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంటిమెంట్ అస్త్రాలను ప్రయోగించి విజయం సాధించిన కౌశిక్ రెడ్డి వ్యూహాలు, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఏమాత్రం పారలేదు. గత అసెంబ్లీ ఎన్నికల ముందర కౌశిక్ రెడ్డి తన కుటుంబంతో కలిసి మీడియా ముందుకు వచ్చి, తనకు ఓట్లేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ భావోద్వేగపూరిత వీడియోను విడుదల చేశారు. ఆనాడు ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి ఆయన గెలిచినప్పటికీ, స్థానిక ఎన్నికల్లో మాత్రం పట్టణ ఓటర్లు అభివృద్ధిని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులనే ప్రామాణికంగా తీసుకున్నారు.
కౌశిక్ రెడ్డి చేసిన హడావుడి, గెలుపుపై ధీమా అన్నీ నీటి మూటలయ్యాయి. వార్డుల వారీగా పట్టు సాధించడంలో ఆయన వైఫల్యం చెందారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. బిజెపి నేత ఈటల రాజేందర్ తన వర్గీయులను బరిలోకి దింపినప్పటికీ, అక్కడ కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. బిజెపి కేవలం 5 వార్డుల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఒకప్పుడు ఈటల కంచుకోటగా ఉన్న హుజూరాబాద్‌లో బిజెపి మూడో స్థానానికి పరిమితం అయింది. అటు కౌశిక్ రెడ్డికి, ఇటు ఈటలకు షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ మున్సిపాలిటీపై జెండా ఎగురవేసింది.