పైసా వ‌సూల్‌ రివ్యూ : స్టోరీ థోడా… బాల‌య్య‌ చాలా తేడా

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5

ఏ హీరో అయినా పూరి జ‌గ‌న్నాథ్‌తో తో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడంటే దానికి రెండు బ‌ల‌మైన కార‌ణాలు ఉండి ఉంటాయి.

1. పూరి హీరోల మేకొవ‌ర్ కొత్త‌గా ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కూ చూసిన హీరో.. పూరి క‌థ‌లో తేడాగా క‌నిపిస్తాడు.
2.పూరి త‌న ఎన‌ర్జీ అంతా హీరోకి ఇచ్చేస్తాడు. త‌న హీరోని పిచ్చ పిచ్చ‌గా ప్రేమిస్తాడు.

ఎన్ని ఫ్లాపులు ఇస్తున్నా – పూరితో సినిమా చేయ‌డానికి బ‌డా హీరోలంతా త‌య్యార‌వ్వ‌డానికి ప్ర‌ధాక కార‌ణాలు ఇవే! బ‌హుశా నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఈ రెండు పాయింట్ల‌నే దృష్టిలో ఉంచుకొని పూరికి అవ‌కాశం ఇస్తే.. పూరి అందుకు త‌గిన‌ సినిమానే తీశాడు, త‌న బాధ్య‌త‌ని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాడు. ఇంత‌కు మించి ఏం కోరుకొన్నా – పైసా వ‌సూల్ దానికి చాలా కిలోమీట‌ర్లు దూరంలో నిల‌బ‌డిపోయి ఉంటుంది. అదెలా, ఏంటి, ఎందుకు? కాస్త డిటైల్డ్‌గా తెలుసుకొంటే…

* క‌థ‌

ముందు క‌థ నుంచి చెప్పుకొందాం! బ‌హుశా ఇలాంటి క‌థ వినీ వినీ మీకు అల‌వాటైపోయి ఉంటుంది. కానీ…. చెప్పుకోక త‌ప్ప‌దు. అన‌గ‌న‌గా ఓ ఇడియ‌ట్ లాంటి హీరో. అత‌ని పేరు తేడా సింగ్‌. పేరుకి త‌గ్గ‌ట్టే పోకిరి. తిక్క రేగితే ఎవ్వ‌రినైనా ఎదిరిస్తాడు. ఫైటింగులంటే పిచ్చ స‌ర‌దా. పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా వీడిలాంటోడి కోసం ఎదురుచూస్తుంటుంది. ఇలాంటి వాడితోనే ఇంట‌ర్నేష‌న‌ల్ డాన్ అయిన బాబ్ మార్లే ని ప‌ట్టుకోవాల‌నుకొంటుంది. దానికి సై అంటాడు తేడా సింగ్‌! మ‌రి తేడా సింగ్‌కి ఆ డాన్ దొరికాడా? అస‌లు తేడా సింగ్ ఎవ‌రు? ఎక్క‌డి నుంచి వ‌చ్చాడు? త‌న నేప‌థ్యం ఏమిటి? పోర్చుగ‌ల్లో త‌ప్పిపోయిన సారిక ఎవ‌రు? త‌న‌కీ తేడాసింగ్‌కి సంబంధం ఏమిటి? ఇవ‌న్నీ ప్ర‌శ్న‌లైతే… అందుకు సంబంధించిన స‌మాధానాలు పైసా వ‌సూల్‌లో క‌నిపిస్తాయి.

* విశ్లేష‌ణ‌

ఈ సినిమా ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌లో ఓడైలాగ్ ఉంది.
`ఓన్లీ ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ – అవుట‌ర్స్ నాట్ ఎలౌడ్‌` అని! స‌రిగ్గా ఈ సినిమా కూడా అంతే. బాల‌య్య ఫ్యాన్స్ కీ, వీరాభిమానుల‌కు, బాల‌య్య పేరు చెబితే చొక్కాలు చించుకొనేవాళ్ల‌కూ.. ఈ సినిమా ఓ ఫీస్ట్‌! మిగిలిన వాళ్ల‌కు రొటీన్‌… రొటీన్.. రొటీన్…

పోకిరి చొక్కానే బాల‌య్య‌కు తొడిగాడు పూరి. ఇలాంటి చొక్కా బాల‌య్య ఎప్పుడూ వేసుకోలేదు కాబ‌ట్టి…. బాల‌య్య ఫ్యాన్స్‌కి ఈ సినిమా కొత్త‌గా అనిపిస్తుంది. బాల‌య్య డైలాగ్ డెలివ‌రీ, మేకొవ‌ర్‌, యాక్ష‌న్ సీన్స్‌లో స్పీడు చూస్తుంటే.. ముచ్చ‌టేస్తుంది. `ఇది క‌దా.. బాల‌య్య నుంచి కోరుకొనేది` అనిపిస్తుంది. యాక్ష‌న్ స‌న్నివేశాని ముందు… బాల‌య్య ప‌లికే డైలాగులు, ఆ స‌న్నివేశంలో బాల‌య్య పెర్‌ఫార్మ్సెన్స్‌, బాడీ లాంగ్వేజ్ ఇవ‌న్నీ చూస్తే క‌డుపు నిండిపోతుంది. ప‌ది మందికి పెట్టినా మ‌న‌మే – న‌లుగుర్ని కొట్టినా మ‌న‌మే – అంటూ ప్ర‌జెంట్ సినారియోని దృష్టిలో ఉంచుకొని రాసిన డైలాగులు, `నాకు మెన్ష‌న్ హౌస్ త‌ప్ప ఇంకేం తెలీదు` అంటూ బాల‌య్య‌తో ప‌లికించిన వ‌న్ లైన‌ర్లు… థియేట‌ర్‌లో పండ‌గ వాతావ‌ర‌ణం సృష్టిస్తాయి. బాల‌య్య త‌న‌ హుషారుతో ఈ సినిమాని నిల‌బెట్ట‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేశాడు. ఫైట్ సీన్‌లో కూడా స్టెప్పులు వేస్తున్న బాల‌య్య‌లో ఇంకా చిన్న కుర్రాడు క‌నిపిస్తుంటాడు. ఇంట్ర‌వెల్‌లో బుల్లెట్ గుండెల్ని తాకినా.. సిగ‌రెట్ వెలిగించి డైలాగ్ చెప్పిన తీరు.. బాల‌య్య‌కే సాధ్యం. ఇంత వ‌ర‌కూ ఓకే.

అయితే అవి దాటి వ‌చ్చి, మిగిలిన క‌థ‌నీ, చుట్టు ప‌క్క‌న పాత్ర‌ల్ని చూస్తే… పూరి పై జాలి, కోపం వ‌గైరా వ‌గైరాలు క‌లుగుతాయి. బాల‌య్య లాంటి ఓ అగ్ర హీరో, వ‌రుస విజ‌యాల త‌ర‌వాత పూరి ని న‌మ్మి సినిమా చేయ‌డానికి ముందుకొస్తే.. ఇంకా మాఫియా, అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్ అంటూ ప‌దేళ్ల క్రితం నాటి క‌థ ప‌ట్టుకొన్నాడంటే.. మంచి అవ‌కాశాన్ని వృథా చేసుకొన్న‌ట్టే. ఎంత సేపూ హీరోని త‌న దారిలోకి తెచ్చుకోవాల‌న్న ఆలోచ‌న త‌ప్ప‌, హీరో దారిలో వెళ్లి…. అత‌ని స్టైల్‌కి త‌గిన సినిమా తీద్దాం… కొత్త‌గా చూపిద్దాం అనిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. పూరి దృష్టంతా బాల‌య్య అభిమానుల్ని మెప్పించ‌డంపైనే ఉంది. అందుకే బాల‌య్య పాత్ర‌ని విప‌రీతంగా ప్రేమించేశాడు. త‌న డైలాగుల‌న్నీ ఆ పాత్ర‌కే రాసేశాడు. దాని చుట్టూ ఉన్న మిగిలిన పాత్ర‌ల్ని, వాటికి అంటుకొని తిరుగుతున్న కాసింత క‌థ‌ని ప‌క్క‌న పెట్టాడు. దాంతో ఎవ‌రో ఇది వ‌ర‌కు చేసిన స‌న్నివేశాల్ని బాల‌య్య తిరిగి పేర‌డీ చేస్తున్న‌ట్టు అనిపిస్తుంటుంది. పూరి గ‌త సినిమాల్నీ చూసుకొంటాడో లేదో. తీసేసి మ‌ర్చిపోతాడేమో. లేదంటే క‌థ‌, స్క్రీన్‌ప్లే కూడా అవే ఫార్మెట్లో సాగ‌డం ఏమిటి? మాఫియా, అక్క‌డి అరాచ‌కాలు, మాన‌భంగాలూ.. ఈ గోల పూరికి బాగా ప‌ట్టేసింది. అందులోంచి బ‌య‌ట‌కు వ‌స్తే కొత్త‌గా ఆలోచించే వీలు ద‌క్కుతుంది. చిన్న పిల్లాడి గుండెల్లో క‌సితీరా బుల్లెట్లు దించిన స‌న్నివేశం… బ‌హుశా ఈ సినిమాలోనే తొలిసారి చూపించారేమో! అది సృజ‌న అనుకోవాలా? పూరి సున్నిత‌త్వానికి దూరం అయిపోతున్నాడు అనుకోవాలా??

* న‌టీన‌టులు

బాల‌కృష్ణ కోసం.. అత‌ని డైలాగుల కోసం, మేన‌రిజం కోస‌మే మేం పైసా వ‌సూల్ చూస్తాం అనుకొంటే నిర‌భ్యంత‌రంగా ఈ సినిమా చూడొచ్చు. బాల‌య్య కూడా ఏలోటూ చేయ‌డు. ఓ కొత్త బాల‌య్య‌ని చూడ‌డం ఖాయం. తేడా సింగ్ పాత్ర‌లో అంత‌గా పండిపోయాడు. ఈ సినిమాలో ఓ జోక్ వేయాల‌న్నా బాల‌య్యే, ఓ పంచ్ ప‌డాల‌న్నా బాల‌య్యే.. ఏం చేసినా బాల‌య్యే. అలా వ‌న్ మాన్ షో అయిపోయింది. గౌత‌మి పుత్ర త‌ర‌వాత‌…. బాల‌య్య మేకొవ‌ర్ ఇలా ఉంటుంద‌ని ఎవ్వ‌రూ ఎక్స్‌పెక్ట్ చేయ‌రు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నా శ్రియ‌కే అగ్ర‌తాంబూలం. అయితే.. ఆమె గ్లామ‌ర్ విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. పూరి సినిమాల్లో విల‌న్లు ఏం చేస్తారో, ఏం చేయ‌గ‌ల‌రో.. ఈసినిమాలోనూ విల‌న్ గ్యాంగ్ అదే చేసింది.. అలానే న‌టించింది. పూరి ప్ర‌తీ సినిమాలోనూ అలీ పాత్ర పేలిపోతుంటుంది. ఈ సినిమాలో అలీ కూడా ఉన్నాడా?? అనే డౌట్ వ‌స్తుంది.. సినిమా చూశాక‌. ఫృథ్వీ నుంచి ఒక్క జోక్ పేల‌క‌పోవ‌డం, అర సెక‌ను కూడా నవ్వించ‌క‌పోవ‌డం ఇదే తొలిసారేమో.

* సాంకేతిక వ‌ర్గం

అనూప్ పాట‌లు, నేప‌థ్య సంగీతం అంతంత‌మాత్ర‌మే. పూరి డైలాగ్ రైట‌ర్‌గా స‌క్సెస్ అయ్యాడు. అదీ బాల‌య్య పార్ట్ వ‌ర‌కూ మాత్ర‌మే. క‌థ‌కుడిగా పూర్తిగా దారి త‌ప్పాడు. పోకిరి హ్యాంగోవ‌ర్ నుంచి పూరి… ఇంకా బ‌య‌ట‌ప‌డ‌క‌పోవ‌డం సినిమా దుర‌దృష్టం. సినిమా నిడివి ప‌రంగా చిన్న‌దే. ఆ విష‌యంలో ఎడిట‌ర్ కాస్త షార్ప్‌నెస్ చూపించాడు. సినిమా అంతా యాక్ష‌న్ సీన్ల‌తో నిండిపోయింది. వాటి మేకింగ్ ఎలా ఉన్నా… ప్ర‌తీసారీ దంచి కొట్ట‌డం ఇబ్బందిక‌ర‌మే. బాల‌య్య కొట్టుడులో కంటే, డైలాగుల‌తోనే ఎక్కువ కిక్ వ‌చ్చింది.

* ఫైన‌ల్ పంచ్ : ఫ‌ర్ ద బాల‌య్య‌. ఆఫ్ ద బాల‌య్య‌, బై ద బాల‌య్య‌… అంతే!!

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.