భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ సైనిక ఉన్నతాధికారి ఔరంగజేబ్ అహ్మద్ చేసిన ఓ ప్రకటన సంచలనంగా మారింది. 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది భారత సైనికుల మరణం వెనక తమ పాత్ర ఉందని అంగీకరించారు. అంతర్జాతీయ మీడియా ముంగిటే ఈ విషయాన్నిఒప్పుకున్నారు. దీంతో ఇన్నాళ్లు ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదని బుకాయిస్తూ వచ్చిన పాక్ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినట్లు అయింది.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి పాక్ అధికారులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో డీజీఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ , నేవీ ప్రతినిధితో కలిసి ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడారు. పుల్వామా దాడితో తమ వ్యూహాత్మక ప్రతిభ ఏంటో భారత్ కు చెప్పాలని పాక్ ప్రయత్నించిందని చెప్పుకొచ్చారు. పుల్వామా ఎటాక్ పాక్ వ్యూహాత్మక ప్రతిభగా అని క్రెడిట్ ఇచ్చేసుకున్నారు.
పుల్వామా దాడి వెనక హస్తం ఉందని ఆరేళ్ల తర్వాత పాక్ సైన్యం అంగీకరించగా..గత నెలలో పహల్గంలో జరిగిన ఉగ్రదాడి వెనక కూడా పాక్ సైన్యం హస్తం ఉందన్న అనుమానాలను తాజాగా నిజం చేశారు. ఔరంగజేబ్ చేసిన ప్రకటనతో పాక్ సైన్యం టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుందని అంతర్జాతీయ సమాజం ముందు అంగీకరించింది.