పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రస్తుతం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. స్వదేశంలో తీవ్రమైన ఇంధన కొరత, ఆర్థిక సంక్షోభం , నిత్యావసరాల ధరలతో ప్రజలు అల్లాడిపోతుంటే.. పాకిస్థాన్ ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పొరుగు దేశంపై దాడులకు దిగుతోంది.
మానసిక రోగుల్ని చంపిన వారినేమంటారు?
తమ దేశంలో ఆకలి కేకలు, విద్యుత్ కోతలు రాజ్యమేలుతున్నా.. పాకిస్థాన్ పాలకులు మాత్రం యుద్ధ పిపాసను వీడటం లేదు. కాబూల్‌లోని ఓమిడ్ డ్రగ్ రిహాబిలిటేషన్ ఆసుపత్రిపై పాకిస్థాన్ క్షిపణి దాడులు చేయడంతో సుమారు 400 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత హేయమైన చర్య. చికిత్స పొందుతున్న రోగులు, అభాగ్యులపై బాంబులు కురిపించి, దానిని విజయం గా అభివర్ణించుకోవడం ఆ దేశపు అమానవీయ కోణాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఏ దేశమైనా యుద్ధం చేసేటప్పుడు కనీసం ఆసుపత్రులు, పాఠశాలలు , పౌర ఆవాసాలను వదిలివేస్తుంది. కానీ పాక్ సైన్యం ఈ కనీస నిబంధనలను తుంగలో తొక్కి మానవత్వాన్ని మంటగలుపుతోంది.
పాకిస్థాన్ ఎందుకిలా చేస్తోంది?
ఆ దేశం ప్రస్తుతం ఒక విచిత్రమైన హైబ్రిడ్ కోర్షన్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం తమకు అనుకూలంగా లేకపోవడం, సరిహద్దు వివాదాలు పెరగడంతో నేరుగా యుద్ధానికి దిగింది. అయితే, ఈ యుద్ధం వెనుక మరో పెద్ద కుట్ర కూడా ఉంది. దేశం లోపల పెరుగుతున్న పౌర నిరసనలు, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఆందోళనల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి దేశభక్తి కార్డును వాడుకోవాలని పాక్ సైన్యం భావిస్తోంది. ఇంధనం కొనడానికి డబ్బులు లేకపోయినా, బాంబులు వేయడానికి మాత్రం నిధులు వెచ్చిస్తూ ఆ దేశం తన సొంత గొయ్యిని తానే తవ్వుకుంటోంది.
పాక్ కు ఐక్యరాజ్య సమితి హెచ్చరిక
ఈ దాడులపై భారత్ సహా ప్రపంచ దేశాలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాయి. ఆసుపత్రులపై దాడులు చేయడం యుద్ధ నేరం అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం హెచ్చరించింది. భారతదేశం కూడా ఈ హింసను ఖండిస్తూ, పౌరుల ప్రాణాలను పణంగా పెట్టే ఇలాంటి చర్యలు ప్రాంతీయ శాంతికి గొడ్డలి పెట్టు అని స్పష్టం చేసింది. గతంలో తాము పెంచి పోషించిన ఉగ్రవాదులే ఇప్పుడు పాకిస్థాన్‌కు సవాలుగా మారడం, దానికి బదులుగా అమాయక ఆఫ్ఘన్ పౌరులపై ప్రతాపం చూపడం పాక్ అసమర్థతకు నిదర్శనం. ఇప్పటికే అంతర్జాతీయంగా ఏకాకిగా మారిన పాకిస్థాన్, ఇలాంటి అనాగరిక దాడుల వల్ల మరింత అప్రతిష్ట పాలవుతోంది. కానీ ఆ దేశ పాలకులకు ఇదేమీ పట్టడం లేదు.


