భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే పాకిస్తాన్ నిన్న రాత్రి పదకొండు గంటల వరకూ దాడులు చేసింది. డ్రోన్లు పంపింది. భారత్ వాటిని కూల్చివేసింది. అయితే కాల్పుల విరమణకు అంగీకరించామని చెప్పి మరీ ఇలా చేయడం ఏమిటన్న ప్రశ్నలు వచ్చాయి. దీనికి భారత్ వెంటనే సమాధానం ఇచ్చింది. అర్థరాత్రి పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మీడియా ముందుకు వచ్చి కాల్పుల విరమిస్తున్నామని చెప్పారు. అప్పటి వరకూ ఆయన ఎక్కడికి పోయారు ? .
మిలటరీ గుప్పిట్లో పాక్
పాకిస్తాన్ లో మిలటరీ అనూహ్యమైన బలంతో ఉంటుంది. సరిహద్దుల్లో కాపలా కాసి.. చొరబాట్లు ఆపాల్సిన సైన్యం.. దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. అక్కడే అసలు సమస్య వస్తుంది. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేది .. వారిని సరిహద్దు దేశాలపైకి ఎగబడేలా చేస్తోంది సైన్యమే. పాలకుల నిర్ణయాలు అమలు చేయాలా వద్దా అన్నది నిర్ణయించేది సైన్యమే. అందుకే నిర్ణయం అమల్లోకి వచ్చే సరికి ఆలస్యమయింది. పూర్తిగా ఆపిన తర్వాతనే పాక్ ప్రధానితో ప్రెస్ మీట్ కు మిలటరీ అంగీకరించింది.
మిలటరీతోనే మాట్లాడిన అమెరికా విదేశాంగ మంత్రి
అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో పాకిస్తాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపలేదు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తో పాటు ఇతర ఆర్మీ ఆఫీసర్లతో మాట్లాడారు. కాల్పుల విరమణ చేయాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. పాకిస్తాన్ పాలకులకు ఎప్పుడూ యుద్ధంగా ఆసక్తి లేదు. వారు దేశాన్ని నడిపించాలంటే ముందు డబ్బు ఉండాలని అనుకుంటారు. దాని కోసం కిందా మీదా పడుతున్నారు. కానీ మిలటరీకి ఈ విషయాల్లో సంబంధం లేదు. అందుకే వారు రెచ్చిపోయారు.
మిలటరీని పాక్ పాలకులు అదుపులోకి తెచ్చుకుంటేనే సమస్యకు పరిష్కారం !
పాకిస్తాన్ పాలకులు మిలటరీ ప్రభావాన్ని రాజకీయాలపై తగ్గించుకుంటేనే పరిస్థితి మారుతుంది. ఉమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టడానికి కూడా ఆర్మీనే కారణం . అనేక ఉగ్రవాద చర్యలకు ఆర్మీ చర్యలే కారణం. బలూచిస్తాన్ లో ఆఘాయిత్యాలకు పాల్పడి అక్కడి ప్రజలు పాకిస్తాన్ లో ఉండేది లేదని.. స్వాతంత్ర్యంకావాలని పోరాడేలా చేసుకుంది ఆర్మీనే. వారి ఉగ్రవాదానికి బలవుతోంది ఆర్మీనే. అది చాలదన్నట్లుగా కశ్మీర్ పై వ్యాఖ్యలు. పాక్ ఆర్మీలో మునీర్ లాంటి ముషారఫ్ లు ఉన్నంత కాలం.. ఆ దేశం బాగుపడదు. ఆర్మీ తన పని తాను చేసుకోకుండా ఆ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నంత కాలం.. పాక్ దుస్థితి మారదు.