పెహల్గాం దాడి జరిగినప్పటి నుండి పాకిస్తాన్ టెన్షన్ తో చచ్చిపోతోంది. తమ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై ఎప్పుడు దాడి చేస్తారో అని బిక్కుబిక్కుమంటోంది. యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది. భారత్ తమ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని.. అణుబాంబులు వేస్తామని బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారి మాటల్ని ఎవరూ ఆలకించడం లేదు. భారత్ మాత్రం.. కొట్టే దెబ్బ మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంటుందని లీకులు ఇస్తూ.. సన్నద్ధం అవుతోంది. ఈ ఉత్కంఠ తట్టుకోవడం పాకిస్తాన్ వంతు కావడం లేదు.
యుద్ధ సన్నాహాల కారణంగా ఇప్పటికే పాకిస్తాన్ తో చాలా దేశాలు దూర దూరంగా ఉంటున్నాయి. కనీసం ఎయిర్ స్పేస్ నుంచి తమ విమానాలను పంపడానికి ఇతర దేశాలు సిద్ధంగా లేవు. వ్యాపారాలు ఆగిపోయాయి. ఇలా అయితే తట్టుకోవడం కష్టమని.. అంతర్జాతీయంగా భారత్ పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. రష్యా అధ్యక్షుడితో మోదీకి ఫోన్ చేయించారు. పెహల్గాం దాడి విషయంలో ఎవరిది తప్పు అయినా శిక్షించాలని.. తమ వద్ద ఉగ్రవాదులు ఉంటే ఆధారాలు ఇస్తే ఇస్తామని చెప్పించారు. తమ పాత్ర లేదని పాకిస్తాన్ చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దృష్టికి కూడా తీసుకెళ్లారు. వారు చేయడానికి ఏమీ లేదు. కానీ తమ గోల వినమని పాకిస్తాన్ వేడుకుంది. ఉగ్రవాదానికి ఏ దేశం మద్దతు ప్రకటించే అవకాశం లేదు. భారత్ కూడా ఉగ్రవాద శిబిరాల పైనే దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో భారత్ సివిల్ మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ ను ఏడో తేదీన నిర్వహిస్తున్నారు. భారత్ ఏం చేస్తుందో తెలియడం లేదు కానీ.. ఏదో చేస్తోందని పాకిస్తాన్ మాత్రం తీవ్ర టెన్షన్ కు గురవుతోంది.