మరో పాకిస్తానీ టెర్రరిస్ట్ సజీవంగా పట్టుబడినట్టు వార్త రాగానే అతని నుంచి మరింత కీలకమైన సమాచారం రాబట్టే వీలుంటుందని ఉన్నతాధికారులు భావించడం సహజమే. అయితే అదే సమయంలో పాతప్రశ్నే మళ్లీ వేసుకోవాల్సివస్తున్నది.
మనదేశ చట్టాల ప్రకారం ఉగ్రవాదిని విచారించి చివరకు అతనికి శిక్ష విధించేటప్పుటికి ఏళ్లకుఏళ్లు దొర్లిపోతుండటం పట్ల దేశ పౌరులు అసహనంగా ఉన్నమాట వాస్తవం. పాకిస్తానీ టెర్రరిస్టులు మనదేశంపై యుద్ధం ప్రకటించి విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ భయానక పరిస్థితులను సృష్టిస్తుంటే సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది విషయంలో జాప్యం చేయడం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ కు అలుసిచ్చినట్టే అవుతుందన్న భావన బలపడుతోంది. దీంతో చీటికీమాటికీ దేశభద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి.
జమ్మూ-కాశ్మీరులోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులకూ భద్రతాదళాలకీ నడుమ జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే మరో ఉగ్రవాదిమాత్రం సజీవంగా పట్టుబడ్డాడు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ సజ్జాద్ అహ్మద్ పట్టుబడినట్టు సైనిక అధికారులు వెల్లడించారు. 22ఏళ్ల సజ్జాద్ పాకిస్తాన్ లోని ముజఫర్ నగర్ కి చెందినవాడని గుర్తించారు. ఇంతకు ముందు జమ్మూకాశ్మీర్ లోని ఉధంపూర్ లో ఉగ్రవాదులు దాడిజరిపినప్పుడు కూడా ఒక ఉగ్రవాది (నవేద్ యాకూబ్) సజీవంగా పట్టుబడ్డాడు. దీంతో నెలవ్యవధిలో ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులు సజీవంగా పట్టుబడ్డట్టయింది.
2008లో ముంబయ్ ఉగ్రదాడి జరిగినప్పుడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సమర్థవంతంగా తిప్పికొట్టినప్పుడు అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు. 2012 నవంబర్ లో కసబ్ ను ఉరితీశారు. కసబ్ పట్టుబడ్డ తర్వాత శిక్ష అమలు కావడానికి దాదాపునాలుగేళ్లు పట్టిందన్నమాట.
ఇక యాకూబ్ విషయానికివస్తే, 1993లో ముంబయి వరుసు బాంబుపేలుళ్ల సంఘటన జరిగితే, యాకూబ్ ని దోషిగా నిర్ధారించి, క్షమాభిక్ష పిటీషన్ల వ్యవహారం దాటుకుని చివరకు అతగాడ్ని ఉరికంబం ఎక్కించేసరికి 2015 జులై 30 వచ్చేసింది. ఇంత జరిగినా యాకూబ్ ని ఉరితీయడంపై కొన్నివర్గాల్లో ఏదో అసంతృప్తి చోటుచేసుకుంది. అతని మద్దతుదారుల సంఖ్య కూడా పెరగడం, అంత్యక్రియలకు ఎక్కువమందే హాజరుకావడం, ఆ కార్యక్రమాన్ని టీవీల్లో కూడా చూపించడం వంటి అంశాలు వివాదాస్పదంగా మారాయి.
ఉగ్రవాద చర్యలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో జాతీయతాభావం పెరగాల్సిందిపోయి, ముష్కరులపై కూడా సానుభూతి వ్యక్తం చేసే పరిస్థితి ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నా, దానికి ప్రధానకారణం మాత్రం వేడితగ్గిన తర్వాత శిక్షను అమలుచేయడంవల్లనే అన్నది పచ్చినిజం. భారతీయ నేర శిక్షాస్మృతిలోని ఉదారవాదాన్ని నేరస్థులు తమకు అనుకూలంగా వాడుకోవడం గమనార్హం. కరడుగట్టిన నేరస్థులపట్ల కూడా కనికరం చూపడం లౌకికవాద దేశంలో సహజమే అయినా, దేశభద్రత వంటి కీలక పరిస్థితుల్లో మాత్రం, జాతీయతాభావానికే పెద్దపీటవేస్తూ పట్టుబడిన ఉగ్రవాదులకు వెంటనే కఠిన శిక్షలు అమలుచేయాలి. అందుకు అవసరమైతే చట్టాల్లో సవరణలు చేయాలి.
– కణ్వస