ఈరోజు ఉదయం జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో ఉదంపూర్ వద్ద భధ్రతా దళాల మీద దాడి చేసిన ఇద్దరు పాక్ ఉగ్రవాదులలో ఒకడు భధ్రతా దళాల చేతిలో హతం అవ్వగా మరొకడు తప్పించుకొని పారిపోయాడు. కానీ స్థానికుల సహకారంతో అతనిని సజీవంగా పట్టుకోగలిగారు. అతని పేరు ఉస్మాన్ ఖాన్. పాకిస్తాన్ నుండి అడవుల గుండా ప్రయాణిస్తూ భారత్ చేరుకొన్నట్లు తెలిపాడు. హిందువులను చంపేందుకే తను పాక్ నుండి భారత్ కి వచ్చినట్లు తెలిపాడు. అంటే ప్రస్తుతం కొనసాగుతున్న అమర్ నాద్ యాత్రలో హిందువులపై దాడి చేయవచ్చని మన నిఘావర్గాల హెచ్చరికలు నిజమని అర్ధమవుతోంది. పైగా హిందువులను చంపడం చాలా వేడుకగా ఉంటుందని అతను నవ్వుతూ చెప్పడం చూసి అతనిని ప్రశ్నిస్తున్న మీడియా సైతం నివ్వెరపోయారు.
తను 12 రోజుల క్రితమే భారత్ లోకి ప్రవేశించానని చెప్పాడు. అంటే తను ఒక్కడే అడవుల గుండా ప్రయాణిస్తూ వచ్చేనని అతను చెప్పడం చూస్తే, ఇద్దరు ఉగ్రవాదులు వేర్వేరు మార్గాలలో భారత్ లోకి ప్రవేశించినట్లు అర్ధమవుతోంది. 12 రోజుల క్రితమే భారత్ లోకి ప్రవేశించానని అతను చెపుతున్నాడు కనుక ఇంతకాలం మన భద్రతా దళాలు, నిఘావర్గాల కళ్లుగప్పి తిరుగగలిగాడనే మరో విషయం బయటపడింది. ఇప్పుడయినా వాళ్ళిద్దరూ భధ్రతా దళాల మీద దాడికి పాల్పడ్డారు కనుకనే పట్టుబడ్డాడు తప్ప లేకుంటే ఇంకా తప్పించుకొని తిరుగ గలిగేవాడేమో కూడా? కానీ చేతిలో ఆయుధం పెట్టుకొని ఇన్ని రోజులు ఎవరి కంటాపడకుండా తప్పించుకొని తిరగడం విశేషమే…అది మన నిఘా వర్గాల వైఫల్యం అని కూడా అనుకోవచ్చును. అతను కొద్ది రోజుల క్రితం పంజాబ్ గురుదాస్ పూర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో కూడా పాల్గొన్నట్లు సమాచారం.
తనతో ఈ దాడిలో పాల్గొన్న తన సహచరుడు భారత జవాన్ల చేతిలో మరణించాడని, ఒకవేళ తను కూడా చనిపోయుంటే అది అల్లా నిర్ణయంగా స్వీకరించి ఉండేవాడినని చెప్పాడు. అంటే అతను ప్రాణాలకు తెగించే వచ్చేడని అర్ధమవుతోంది.
అతను మొదట తన వయసు 20సం.లని చెప్పి మళ్ళీ కొద్ది సేపటికే 16 ఏళ్ళని మాట మార్చాడు. ఇదివరకు ముంబై దాడుల సమయంలో సజీవంగా పట్టుబడ్డ అజ్మల్ కసాబ్ అనే ఉగ్రవాది కూడా తన వయసు 16సం.లు అని చెప్పుకొన్నాడు. అతను చాలా తీవ్రనేరానికి పాల్పడినప్పటికీ భారత చట్టాల ప్రకారం అతను బాల నేరస్తుడుగా గుర్తించబడుతాడు కనుక అతని వయసును నిర్ధారించుకోవడానికి భారత ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. ఎట్టకేలకు అతను మైనర్ కాదని నిరూపించిన తరువాతనే అతనిపై న్యాయ ప్రక్రియ ఊపందుకొని చివరికి ఉరి శిక్ష పడింది. అందుకే ఇప్పుడు పట్టుబడ్డ ఉస్మాన్ ఖాన్ కూడా తన వయసును తగ్గించి చెప్పుకొంటునట్లు భావించవచ్చును.
తను పాకిస్తాన్ దేశస్థుడినని, లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తినని అతనే స్వయంగా చెప్పుకొన్నాడు. ఇదివరకు అజ్మల్ కసాబ్ పట్టుబడినప్పుడు అతను కూడా తను పాకిస్తాన్ దేశస్థుడినని చెప్పుకొన్నప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం అతను తమ దేశానికి చెందినవాడు కాదని బుకాయించింది. కానీ తరువాత పూర్తి రుజువులు సాక్ష్యాలతో సహా అతను పాకిస్తాన్ దేశస్థుడని నిరూపించినప్పుడు మాత్రమే పాక్ అంగీకరించక తప్పలేదు. ఇప్పుడు ఉస్మాన్ ఖాన్ కూడా తను పాకిస్తాన్ దేశస్థుడినని గర్వంగా చెప్పుకొన్నాడు. మరిప్పుడు పాక్ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. ఉస్మాన్ ఖాన్ పట్టుబడటం వలన మన నిఘావర్గాలకు పాక్ ఉగ్రవాదుల గురించి చాలా ముఖ్యమయిన సమాచారం లభించవచ్చును. కానీ అతను దోషి అని నిరూపించి ఉరికంభం ఎక్కించే వరకు అజ్మల్ కసాబ్ పై ఖర్చు చేసినట్లుగానే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.