టీటీడీకి చెందిన గోశాలలో గోమాతల మృతిపై కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా రాజకీయం వాడివేడిగా కొనసాగుతోంది. మూడు నెలలో వంద గోమాతలు మృతి చెందాయని ఆరోపించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ బలమైన కౌంటర్ ఇచ్చింది. జగన్ హయాంలో టీటీడీని ఎలా భ్రష్టు పట్టించారో, గోమాతలకు ఎలాంటి దాణా పెట్టారో వివరించారు. ఈ నేపథ్యంలోనే జగన్ , భూమనకు దమ్ముంటే గోవుల మృతిపై గురువారం ఉదయం 10గంటలకు తిరుమలకు రావాలని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు సవాల్ విసిరారు.
పల్లా శ్రీనివాసరావు సవాల్ ను తను స్వీకరిస్తున్నట్లు భూమన చెప్పారు. రేపు ఉదయం 10 గంటలకు తిరుపతిలోని గోశాలలో కలుద్దాం అంటూ చెప్పారు. అయితే , వైసీపీ హయాంలో ఎలాంటి తప్పులు జరగలేదని భూమనతోపాటు జగన్ రెడ్డి కూడా చెప్పారు. అందుకే పల్లా శ్రీనివాసరావు తన సవాల్ ను జగన్ కూడా స్వీకరించాలన్నారు. కానీ, జగన్ స్పందించకుండా రాజకీయం చేయవచ్చునని భూమనను వదిలారు. లడ్డూ ప్రసాదం కల్తీ చేసి భక్తుల ఆగ్రహానికి గురై తిరుపతిలో పరువు కోల్పోయిన భూమన తిరిగి పరువు నిలుపునేందుకు ప్రస్తుత టీటీడీ పాలకమండలిపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తన చిత్తశుద్దిని నిరూపించుకోకుండా.. తను అవినీతికి పాల్పడలేదని చెప్పకుండా నిందలు వేస్తు రాజకీయం చేస్తున్నారు భూమన. అదే సమయంలో జగన్ ను వెంటబెట్టుకొని వస్తారా? గోశాలకు వెళ్లి అక్కడ జగన్ తో కలిసి పూజలు చేస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో టీటీడీ భ్రష్టు పట్టడానికి మూలవిరాట్ జగన్ రెడ్డే. ఆయనను ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా కేవలం భూమన తోడకొడితే ఏం ప్రయోజనం అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. మరి, పల్లా సవాల్ చేసినట్లు జగన్ ను వెంటబెట్టుకొని భూమన తిరుపతికి బయల్దేతారా ? చూడాలి