ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా.. సరే బుధవారం.. చలో పల్నాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కార్యచరణ కోసం… పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన..శిబిరంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులకు గురైన బాధితులను పోలీసులు… వారి వారి స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. పల్నాడులోని ఆత్మకూరు గ్రామంలో… ఎన్నికల తర్వాత వైసీపీ నేతల దాడులకు భయపడి 150 కుటుంబాలు… బయటకు వెళ్లిపోయాయి. ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులకు పరిస్థితి అర్థమయింది. ధైర్యం చెప్పి బయట తలదాచుకుంటున్న పదిహేను కుటుంబాలను పోలీసులు ఎలాగోలా తీసుకు రాగలిగారు.
మిగతా కుటుంబాలకు సర్ది చెప్పడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది.. గుంటూరులో ఏర్పాటు చేసిన టీడీపీ శిబిరంలో ఉన్నారు. చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునివ్వడంతో.. పల్నాడు అంతా ఒక్క సారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున… ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకోవడంతో.. పోలీసులు ముందు జాగ్రత్తగా ఆంక్షలు విధించారు. పల్నాడు మొత్తం 144సెక్షన్ విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే.. అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. కానీ.. టీడీపీ అధినేత మాత్రం ఈ విషయంలో.. పట్టుదలగా ఉన్నారు. సమస్య ఒక్క పల్నాడు ప్రాంతానిది కాదని… పలు జిల్లాల్లో ఉందని అంటున్నారు. గుంటూరు శఇబిరంలో ఉన్న వారిని మాత్రమే.. ఆయా గ్రామాలకు తీసుకెళ్లి వదిలి పెడితే సరిపోదని.. టీడీపీ నేతలు అంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా.. ఎన్నికల తర్వాత టీడీపీ నేతలపై జరిగిన దాడుల వివరాలు బయటకు తీస్తున్నారు. అక్రమ కేసుల వివరాలనూ పోలీసుల ముందు పెడుతున్నారు. దాడులు చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని .. తెలుగుదేశం పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు.. దాడులకు గురైన వారికి పరిహారం కూడా ఇవ్వాలంటున్నారు. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో కూడా… టీడీపీ క్యాడర్ పై దాడులకు తెగబడ్డారని… టీడీపీ నేతలు అంటున్నారు. ఈ వివాదం ఇంతటితో ఆగదని… రాజకీయ దుమారం రేగడం ఖాయమని తేలిపోతోంది.