Paradha Movie Review
తెలుగు360 రేటింగ్: 2.25/5
‘రివ్యూలు చూసే థియేటర్స్ వెళ్ళండి’.. పరదా చిత్ర బృందం ముక్తకంఠంతో చెప్పిన డైలాగ్ ఇది. అమ్మాయి సమస్యని చూపిస్తున్నాం. కచ్చితంగా క్రిటిక్స్ కి నచ్చేస్తుందనే ధీమా కావచ్చు. అయితే సమస్య ఏదైనా అందులో నిజాయితీ వుంటేనే ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. మరి పరదా కథలో నిజాయితీ ఉందా? ఈ సమస్య ప్రేక్షకులని కదిలించిందా?
ఆ ఊరు పేరు పడతి. గ్రామదేవత జ్వలాంబిక. ఆ ఊర్లో ఈడొచ్చిన అమ్మాయిలు ముఖం కనిపించకుండా పరదా (ముసుగు) వేసుకోవాలనేది ఆచారం. పొరపాటున ముసుగు తీసి ఎవరికైనా కనిపిస్తే.. ఆ ఊర్లో గర్భిణీ స్త్రీలకు, కడుపులో వున్న బిడ్డకి ప్రాణహాని. దీనికి విరుగుడు.. ముసుగు తీసి కనిపించిన అమ్మాయి గ్రామదేవత విగ్రహం వద్ద ఆత్మాహుతి చేసుకోవాలి. అదే ఊర్లో వుండే సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) ముఖాన్ని అనుకోని ఓ సంఘటన వలన దేశం మొత్తం చూస్తుంది. అపచారం జరిగిపోయిందని భావించిన గ్రామస్తులు సుబ్బుని అమ్మవారికి బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తారు. తర్వాత ఏం జరిగింది? అసలు అంత దారుణమైన ఆచారం ఆ ఊర్లోకి ఎలా వచ్చింది? సుబ్బు తనకి వచ్చిన సమస్య నుంచి ఎలా బయటపడిందనేది కథ.
ఫిక్షన్ కథకి ఒకటే రూలు. ఎలాంటి కథ చెప్పినా ప్రేక్షకుడు నమ్మి అందులో లీనమైపోయేలా చెప్పాలి. పరదా కథలో ఒక ఫిక్షనల్ గ్రామాన్ని క్రియేట్ చేశాడు దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల. మహిళలు ఎదుర్కొనే పరదా సమస్యని ఫిక్షన్ చేశాడు. అయితే ఈ ఫిక్షన్ పరదా అతుకుల బొంతలా తయారైంది.
పురుషాధిక్య సమాజంలో స్త్రీలు చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిజాయితీగా తెరపై చూపించడానికి చాలా సమస్యలు వున్నాయి. ఉన్నవి సరిపోనట్లు.. యూపీ, బీహార్, ఒడిశా కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి ఒక దురాగతమైన ఆచారం వుందని, దానికి ఆడియన్స్ కనెక్ట్ కావాలని దర్శకుడు చేసిన ఈ పరదా ప్రయత్నం వృథా ప్రయాసే తప్పా… ప్రేక్షకుడిని సమస్యలో లీనం చేయలేకపోయింది.
అసలు ఈ కథ ఎత్తుగడలో లోపం వుంది. ఈ సినిమా ప్రీమియర్స్ తర్వాత అనుపమ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ”ప్రీమియర్స్ చూసిన వారు మా కథని రివీల్ చేసేస్తున్నారు. ‘ఫోటో’ గురించి చెప్పేస్తున్నారు. అదే పరదా మెయిన్ ప్లాట్ కదా” అని బాధపడిపోయింది. ఆ మాటలు విన్న తర్వాత దర్శకుడి దృష్టి లోపం మరింత తేటతెల్లమైంది. ఈ కథకు ఆధారం ఆచారమే కానీ ఫోటో కాదు. కానీ దర్శకుడు ముందు ఫోటో లైన్ అనుకుని ఆ తర్వాత ఓ దురాచారాన్ని క్రియేట్ చేయడంతో కథలో నిజాయితీ తప్పింది.
ముఖం చూపించిన అమ్మాయిని రాయికట్టి బావిలో తోసేయాలనే ఆచారం ఎంతటి కరుడుకట్టిన దేశం లో కూడా వుండదు. అలాంటిది రైల్వే స్టేషన్ వున్న ఊరు, స్మార్ట్‌ఫోన్స్ వాడుతున్న కల్చర్ వున్న ఓ తెలుగు గ్రామంలో ఇలాంటి దురాచారం వుందని నమ్మించే ప్రయత్నం ఎమోషన్ తీసుకురాకపోగా.. సహనానికి లాజిక్ కి పరీక్ష పెడుతుంది.
ఆచారాలు, సంప్రదాయాలపై సినిమాలు తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి. సహజంగా వుండే సమస్యల మీద అనవసరమైన ఫాంటసీలు రుద్దకూడదు. అలా రుద్దే ఉద్దేశం వుంటే.. ఆర్గానిక్ గా రుద్దే తెలివి వుండాలి. పరదా ట్రీట్మెంట్లో ఆ తెలివే కొరవడింది.
ఒక ఆచారాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్న సుబ్బు కథ ఇది. పరిస్థితుల కారణంగా ఆ పాత్రలో వచ్చిన మార్పు ఈ కథకి ముగింపు. ఇలాంటి కథలకు సన్నివేశ బలం కావాలి. పరదా కథలో సన్నివేశాలే ప్రధాన సమస్య. తోలుబొమ్మలాటతో ఊరుని కథని పరిచయం చేయడం వరకూ ఏదో కొత్త కథే చూడబోతున్నామనే ఆశ కలుగుతుంది. అయితే తర్వాత వచ్చే సన్నివేశాల్లో కొత్తదనం వుండదు. ఫోటో చుట్టూ నడిపిన డ్రామా ఆర్గానిక్ గా అనిపించదు. సుబ్బు ఆత్మాహుతి ఎపిసోడ్ మాత్రం కాస్త ఉత్కంఠ రేపినప్పటికీ ఆ తర్వాత దర్శకుడి కన్వినియంట్ రైటింగ్‌తో కథనం తేలిపోతుంది.
సెకండ్ హాఫ్ ఈ సినిమాకి మరింత గుదిబండగా మారుతుంది. ఆ ఫోటోగ్రాఫర్‌ని వెదికే ప్రయత్నం ఉబుసుపోక వ్యవహారమే కానీ సీరియస్‌నెస్ వుండదు. రాజేంద్ర ప్రసాద్‌తో ఓ పిట్ట కథ చెప్పిస్తారు. బహుశా ఈ సినిమా కథ సారం అంతా ఆ పిట్ట కథలోనే వుందని విమర్శకులు సబ్టెక్స్ట్లు, మెటాఫర్లు వెదుక్కోవాలని చేసిన ప్రయత్నం ఏమో కానీ ..ఆ పిట్టకథ ఇంకా అర్ధవంతంగా సుబ్బు పాత్రతో ముడిపడినదిగా వుండాల్సింది.
సుబ్బు పాత్రలో వచ్చిన మార్పులు కథనాన్ని కదలించేసి ప్రేక్షకుడికి మంచి ఎమోషన్ ఇచ్చేలా వుండవు. క్లైమాక్స్ ఆడియన్స్ కి ముందే తెలిసిపోతుంది. కాకపోతే.. గోపిసుందర్ హెవీ హారర్ బీజీఎం, మృదుల్ సేన్ స్లోమోషన్ షాట్స్‌తో ఏదో జరిగిపోయిందనే భ్రమ కల్పించడం తప్పితే.. ప్రేక్షకుడు ఏం ఊహిస్తాడో సరిగ్గా అదే జరుగుతుంది.
సుబ్బు పాత్రని బలంగా నమ్మింది అనుపమ. ఆ పాత్రలో వీలైనంతగా పరకాయ ప్రవేశం చేయడానికి ప్రయత్నించింది. అయితే ఇలాంటి పాత్రలని నమ్మే ముందు పాత్రలోని నిజాయితీని పసిగట్టాలి. ”డైరెక్టర్ గారు.. మా ఊరుకి రైల్వే స్టేషన్ వుంది. అక్కడ బుక్ స్టాండ్స్ లో ఇంగ్లీష్ మ్యాగజైన్స్ అమ్ముతున్నారు. నేను స్మార్ట్‌ఫోన్ వాడుతున్నాను. మా నాన్నకి నా వాయిస్ రికార్డ్ చేసి అనౌన్స్మెంట్ మైక్ కూడా ఇచ్చాను. ఇంత మోడర్న్ టైంలో వున్నాను కదా.. అలాంటి ఆచారాన్ని ఎందుకు ఫాలో అవుతున్నాను. నా పీకల మీదకి వస్తే గాని అది దురాచారమని నా బుర్రకి తట్టదా?” అని అనుపమ సైడ్ నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చుంటే .. పరదా మరోలా వుండేదేమో.
పరదాకి మూలం అనుకున్న సుబ్బు కథ తేలిపోయినప్పటికీ అమిస్ట పాత్రలో దర్శన రాజేంద్రన్ కథ నిజాయితీ వుంది. ఎంత నిజాయితీగా కష్టపడినా తనకు రావాల్సిన క్రెడిట్ కేవలం జెండర్ కారణంగా పక్కోడి లాక్కోవడం సమాజంలో చాలా చోట్ల కనిపిస్తుంది. ముఖ్యంగా కార్ రేస్ సీన్లో. ఆ తరవాత ఆ పాత్రతో చెప్పించిన డైలాగులు కూడా బాగున్నాయి. అక్కడ ఆ పాత్రలో పెయిన్ ప్రేక్షకుడికి పడుతుంది. రత్న (సంగీత) క్యారెక్టర్ ఈ సినిమాకి కాస్త ఫన్ రిలీఫ్. భర్త హర్షవర్ధన్ తో వాయిస్ మార్చి మాట్లాడిన సీన్ నవ్విస్తుంది. అయితే సంగీత–హర్షవర్ధన్ ట్రాక్ బాపు ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాని గుర్తుకు తెస్తుంది. మేల్ డామినెంట్ క్యారెక్టర్లో రాఘవ మయూర్ కనిపించాడు. గౌతమ్ మీనన్ ది గెస్ట్ రోల్.
గోపి సుందర్ ఇచ్చిన పాటలు వినడానికి బావున్నాయి కానీ సినిమాలో ప్లేస్మెంట్ కుదరలేదు. ఢిల్లీ, దర్శశాల లాంటి ప్రదేశాల్లో సినిమా తీశారు. ట్రావెల్ వ్లాగ్కి బీజీఎం లా వాడుకున్నారు కానీ పాటల్లో ఫీల్ ఆడియన్స్ పట్టదు. మృదుల్ సేన్ కెమరా వర్క్ బావుంది.
సినిమా బండి, శుభం లాంటి చిన్న సినిమాలు తీసిన డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగులకి పరదాతో కాస్త బిగ్ స్కేల్ విజువల్స్ చూపించే అవకాశం దొరికింది. తన విజువల్ సెన్స్ బావుంది. అయితే సినిమా బండి, శుభం సినిమాల్లో వుండే ఆర్గానిక్ టచ్ ఇందులో మిస్ అయ్యింది. పరదాతో ఒక బలమైన కథ చెప్పాలని చూసిన దర్శకుడు.. అసలు కథపైనే ముసుగు కప్పేయడంతో ఈ ప్రయత్నం మసకబారింది.
తెలుగు360 రేటింగ్: 2.25/5
