అవసరం ఉన్నంత వరకే వాడుకుని, ఆ తరువాత ఎంతటి వారినైనా ఇట్టే పక్కన పెట్టేయడం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అలవాటు అనే విమర్శ మొదట్నుంచీ ఉంది! సీఎం మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ విషయంలో కూడా అదే జరిగిందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. చంద్రబాబు తీరుపై పరకాల ప్రభాకర్ గత కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం! ముఖ్యమంత్రి తీరుపై ఆయన విమర్శలు చేస్తున్నారట! తనను అవసరం ఉన్నంతవరకూ వాడుకున్నారనీ, ఆటలో అరటి పండులా పక్కన పడేశారని సన్నిహితుల దగ్గర పరకాల వాపోతున్నారట. తనకు ప్రాధాన్యత తగ్గించేశారనీ, ఉద్దేశపూర్వంగానే తనను తప్పిస్తున్నారని ఆయన విమర్శిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పరకాల ప్రభాకర్ ఓ వెలుగు వెలిగారు. ముఖ్యమంత్రి సలహాదారుగా కీలక పాత్ర పోషించారని చెప్పాలి. సీఎం విదేశాలకు వెళ్తే ఈయన కూడా వెళ్లేవారు. కానీ, ఎక్కడ బెడిసి కొట్టిందో స్పష్టంగా తెలీదుగానీ… దశలవారీగా పరకాలను పక్కన పడేశారు! ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో పరకాల చేసిన కొన్ని వ్యాఖ్యలు చంద్రబాబుకు కాస్త ఇబ్బందిగానే పరిణమించాయి. అయితే, ఆ తరువాత పరిస్థితి బాగానే ఉంది. కానీ, మధ్యనే సమాచార పౌరసంబంధాల శాఖకు కొత్త కమిషనర్‌ను చంద్రబాబు నియమించారు. ఎస్. వెంకటేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన నుంచి పరకాలకు పనిలేకపోయిందని అంటున్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచీ చంద్రబాబు వెన్నంటి ఉంటున్నారు. దీంతో పరకాల ఖాళీ అయిపోయారనీ అంటున్నారు. అందుకే, ఆయన ఈ మధ్య వెలగపూడిలో కూడా ఎక్కువగా ఉండటం లేదట. ఏపీ ఉద్యోగులందరూ హైదరాబాద్ నుంచి వెలగపూడికి వెళ్తుంటే… ఆయన మాత్రం అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసి, ఇక్కడే చాలా రోజులు ఉంటున్నారట.
మొత్తానికి, తెలుగుదేశం నుంచి కూడా పరకాల బయటకి వచ్చేస్తారేమో అనే చర్చ మొదలైంది! మొదట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో పరకాల ఉండేవారు. కొన్నాళ్లు ఆ పార్టీలో బాగానే ఉన్నారు! ఆ తరువాత, చిరంజీవి తీరుపైనా, పార్టీపైనా విమర్శలు గుప్పిస్తూ ఓ ప్రెస్ మీట్ పెట్టేసి బయటకి వచ్చేశారు. ఏకంగా ప్రజారాజ్యం ఆఫీస్‌లోనే ప్రజారాజ్యాన్ని విమర్శిస్తూ మాట్లాడటం అప్పట్లో చర్చనీయాంశంమైంది. ఇప్పుడు అదే అనుభవం తెలుగుదేశం పార్టీకి కూడా ఉంటుందేమో..! ప్రజారాజ్యం నుంచి బయటకి వచ్చిన తరహాలోనే తెలుగుదేశం పార్టీపై విమర్శలు పరకాల విమర్శలు గుప్పిస్తారేమో..!