పరకామణి కేసు కీలక సాక్షి అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారుతోంది. పరకామణి చోరీ కేసు రాజీ చేసుకుంది మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వై. సతీష్‌కుమార్. ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వే ట్రాక్‌పై చనిపోయి పడి ఉన్నారు.
తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి సుమారు 5 కి.మీ. దూరంలోని కోమలి గ్రామం వద్ద స్థానికులు ఉదయం 6 గంటల సమయంలో రైల్వే ట్రాక్‌పై ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. దొరికిన మృతదేహం గుర్తింపు కార్డు, వాలెట్లో టీటీడీ ఐడీ కార్డ్‌తో గుర్తించారు. మృతుడు తిరుపతి నివాసి, టీటీడీ మాజీ ఏవీఎస్వో వై. సతీష్‌కుమార్‌గా ధృవీకరించారు. పోలీసుల ప్రకారం, ఆయన శరీరంపై రైలు ఢీకొన్నట్టు తీవ్ర గాయాలు కనిపించాయి. చంపేసి.. రైలు ప్రమాదంగా చిత్రీకరించే కుట్ర జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.
సతీష్‌కుమార్ మరణం పరకామణి చోరీ కేసుతో ముడిపడి ఉండటం విషయంలో అనుమానాలు పెరుగుతున్నాయి. పరకామణిలో చోరీని గుర్తించి నిందితుడు రవికుమార్ ను పట్టుకుంది సతీష్ కుమారే. ఆయన ఫిర్యాదుతోనే పోలీసు కేసు నమోదు అయింది. అయితే , సెప్టెంబర్ 9, 2023న తిరుపతి లోక్ అదాలత్‌లో సతీష్‌కుమార్, రవికుమార్ రాజీ ఒప్పందం జరిగి, కేసు ముగిసింది. ఎందుకు రాజీ చేసుకున్నారంటే.. తన పై అధికారులు ఒత్తిడి చేయడంతోనే రాజీ చేసుకున్నానని ఆయన ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు.
ఈ నెల 6న సతీష్‌కుమార్‌ను సీఐడీ విచారించింది. మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన చనిపోవడం సంచలనంగా మారింది. గతంలో కొన్ని హై ప్రోఫైల్ కేసుల్లో .. సాక్షులు అనుమానాస్పదంగా చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మరణం కూడా సంచలనంగా మారనుంది.

