కలసి వచ్చే పార్టీలతో కలసి పోరాడుదాం అని వైసీపీ సిద్ధాంతకర్త సజ్జల రామకృష్ణారెడ్డి చాలా రోజులుగా చెబుతున్నారు. అన్నిపార్టీలను కలుపుకోవాలని పార్టీ నేతలకు చెబుతున్నారు. అందుకే ఓ సారి మల్లాది విష్ణు.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వద్దకు వెళ్లారు. అది రాంగ్ సిగ్నల్ గా మారింది. దాంతో మనం పిలిస్తే వాళ్లు రావాలి కానీ.. మనం వెళ్లవద్దని సంకేతాలు ఇచ్చారు. దాంతో ఆ వ్యవహారం అక్కడితో ముగిసింది. ఇప్పుడు వైసీపీ పిలుస్తున్నా ఎవరూ రావడం లేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇస్తున్నారని చేస్తున్న పోరాటంలో ఎవరూ కలసి రావడంలేదు.
చాలా చిన్న పార్టీలను లైన్లో పెట్టిన సజ్జల
సజ్జల రామకృష్ణారెడ్డి చాలా చిన్న పార్టీలను లైన్ లో పెట్టడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. జడ శ్రవణ్ పార్టీ నుంచి, బీసీవై పార్టీ, కమ్యూనిస్టులు, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా ఎలాంటి దుకాణం పెట్టుకున్నా సరే అందరికీ సంకేతాలు పంపారు. వారు కూడా ఇలాంటి పిలుపు కోసమే ఎదురు చుస్తూ ఉంటారు. కలసి వస్తామని వారు సంకేతాలు ఇచ్చారు. కానీ వైసీపీ చేపట్టిన ర్యాలీల్లో ఎవరూ పెద్దగా కనిపించలేదు. సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే వారికి వ్యతిరేకంగా పోరాడటమే తమ శైలి అనుకునే విపక్షాలు తమ పోరాటం తాము చేస్తున్నాయి కానీ జగన్ రెడ్డితో కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
తమతో ఎవరూ రారన్న భావన తొలగించాలని సజ్జల భావన
జగన్ రెడ్డి సింగిల్ సింహం అనే భావనకు కట్టుబడి ఉంటారు. కానీ ప్రభుత్వంపై పోరాడేటప్పుడు.. తమతో పొత్తులు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా తమ నాయకత్వంలో పోరాటానికి ఇతర పార్టీలు కూడా కలసి వస్తే .. పార్టీల బలం కనిపిస్తుంది. ఆయా పార్టీలకు బలం ఉండకపోవచ్చు కానీ.. ఆయా పార్టీల పేర్లు ప్రజలకు నోటెడ్ గా ఉంటాయి. జాతీయ స్థాయిలో ఉన్న పేరు వల్ల మైలేజీ వస్తుంది. అదే సమయంలో వైసీపీ అనే పార్టీతో కలిసేందుకు ఏ చిన్న పార్టీ కూడా ముందుకు రాదని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. జగన్ వ్యవహారశైలి.. వాడుకుని వదిలేసే నైజమే దీనికి కారణం. అయితే .. ఆర్థికంగా ఎంతో కొంత మేలు చేస్తామని చెబితే చాలా మంది వస్తారు. కానీ ఇప్పుడు వారు కూడా రావడం లేదు. వారి ఆశలు, అంచనాలు ఓ రేంజ్ లో ఉండటమే కారణం అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ వైపు పోవడానికి భయపడుతున్న కమ్యూనిస్టులు
సాధారణగా ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటే కమ్యూనిస్టులు ముందు ఉంటారు. కానీ జగన్ తో కలసి నడిచేందుకు రెండు కమ్యూనిస్టు పార్టీలు ఆసక్తి చూపించడంలేదు. జగన్ రెడ్డి వ్యవహారశైలి బీజేపీకి దగ్గరగా ఉండటమే దానికి కారణం. తాము బీజేపీకి వ్యతిరేకం అని జగన్ చెప్పలేరు. అలా చెప్పకుండా జగన్ తో కలిసేందుకు కమ్యూనిస్టు పార్టీలు ముందుకు రావు. ఫలితంగా వైసీపీ ఇప్పటికిప్పుడు కలసి వచ్చే వారందర్నీ కలుపుకుని పోతామని పిలుపుసిస్తోంది కానీ.. అలా వచ్చే వారే కనిపించడం లేదు. ఇతర పార్టీల్ని పొత్తులు పెట్టుకుంటారని విమర్శిస్తారు కానీ.. ఈ పార్టీలతో కలిసి నడిచేందుకు కూడా ఎవరూ ముందుకు రారు.
