భారత రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి రాబోతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెను మార్పులు సంభవించనున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగి, సీట్ల సంఖ్య 50 శాతం పెరిగితే.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పరిధిలో దాదాపు 150 మంది మహిళా ఎమ్మెల్యేలు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇంతటి భారీ సంఖ్యలో మహిళా ప్రతినిధులు అవసరమవ్వడం రాజకీయ పార్టీలకు ఒక అపూర్వమైన అవకాశం, అదే సమయంలో ఒక సవాల్ కూడా. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా, నిర్ణయాధికారంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది.
కింది స్థాయి నుంచి ఎదిగిన మహిళా నేతలకే చాన్స్
సాధారణంగా రిజర్వేషన్లు వచ్చినప్పుడు పురుష నేతలు తమ ఇంట్లోని మహిళలకు టిక్కెట్లు ఇప్పించి, తెర వెనుక నుండి తామే పాలన సాగించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే, మారుతున్న కాలంలో ఇలాంటి రబ్బర్ స్టాంప్ రాజకీయాలు చెల్లుబాటు కావు. ప్రజల నుంచి నేరుగా ఎదిగివచ్చిన వారికి, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న మహిళలకే ఓటర్లు పట్టం కడుతున్నారు. కాబట్టి, నాయకుల ఇంట్లో మహిళలకు టిక్కెట్లు ఇచ్చి సరిపెట్టుకోవడం కాకుండా, సమాజంలో చురుగ్గా ఉండే మహిళా నేతలను గుర్తించడం పార్టీలకు అనివార్యం.
టాలెంట్ హంట్ ప్రారంభించాల్సిందే!
బలమైన మహిళా నాయకత్వాన్ని తయారు చేయడం రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పని కాదు. రాజకీయ పార్టీలు ఇప్పుటి నుంచే గ్రాస్ రూట్ లెవల్ నుండి నాయకత్వ లక్షణాలు ఉన్న మహిళలను గుర్తించి, వారికి శిక్షణ ఇవ్వాలి. వక్తృత్వ నైపుణ్యం, పరిపాలనా దక్షత, ప్రజలతో మమేకమయ్యే గుణం ఉన్న మహిళలను ప్రోత్సహించాలి. అప్పుడే 33 శాతం రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరుతుంది. లేనిపక్షంలో, కేవలం ఎన్నికల సమయంలో హడావుడి చేసి ఎవరో ఒకరికి బి-ఫామ్ ఇవ్వడం వల్ల పార్టీలకు నష్టం వాటిల్లడమే కాకుండా, సమర్థవంతమైన పాలన కుంటుపడుతుంది.
ముందస్తు వ్యూహమే శ్రీరామరక్ష
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్ , బిఆర్ఎస్ లు మహిళా విభాగాలను కేవలం ప్రచారానికి పరిమితం చేయకుండా, వారిని స్వతంత్ర నాయకులుగా తీర్చిదిద్దాలి. ఏ పార్టీ అయితే ముందుగా బలమైన మహిళా క్యాడర్ను సిద్ధం చేసుకుంటుందో, ఆ పార్టీకి రాబోయే ఎన్నికల్లో తిరుగుండదు. మహిళా ఓటర్ల ప్రాబల్యం పెరుగుతున్న తరుణంలో, మహిళా నేతల ద్వారానే వారిని ఆకట్టుకోవడం సులభం అవుతుంది.