చాలా కాలం ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని.. ప్రేమించుకున్నంత కాలం కూడా కలసి ఉండలేకపోయిన జంటల జాబితాలోకి పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ చేరారు. తాము విడిపోతున్నట్లుగా సైనా నెహ్వాల్ ప్రకటించారు. చాలా చర్చల తర్వాత .. కలసి ఉండలేమనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సైనా ప్రకటించారు. కశ్యప్ నుంచి ఇంకా ప్రకటన రాలేదు.
సైనా, కశ్యప్ బ్యాడ్మింటన్ అకాడెమీ నుంచి ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ కెరీర్లో మంచి స్థితికి వెళ్లారు. చాలా కాలం ప్రేమ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఏడేళ్ల తర్వాత విడిపోయారు. ఇప్పటికే గత కొంత కాలం నుంచి వారు విడిగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఫిట్ నెస్ సమస్యలతో సైనా .. టోర్నీలో పాల్గొనడం తగ్గించారు. కశ్యప్ రిటైర్మెంట్ ప్రకటించి కోచింగ్ వైపు వెళ్లారు.
తెలుగులో బ్యాడ్మింటన్ కు మంచి క్రీడాకారులు ఉన్నారు. వారిలో ఇలా జంటలుగా మారి విడిపోయిన వారు ఎక్కువ మందే ఉన్నారు. గతంలో గుత్తా జ్వాలా, చేతన్ ఆనంద్ కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ 2005లో పెళ్లి చేసుకుని 2011లో విడిపోయారు. ఇప్పుడు గుత్తా జ్వాలా తమిళ హీరో విష్ణువిశాల్ను పెళ్లి చేసుకుని ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చారు.